15 నుంచి టీటీడీ ఆల‌యాల్లో పండితుల‌ ప్ర‌వ‌చ‌నాలు

దేశ వ్యాప్తంగా 233 కేంద్రాలలో కార్య‌క్ర‌మాలు

hellotelugu-EOTTD

తిరుపతి : టీటీడీ కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. పవిత్రమైన ధనుర్మాసాన్ని పురస్కరించుకుని టీటీడీ ఆధ్వర్యంలో డిసెంబరు 16 నుంచి జనవరి 14వ తేదీ వరకు తిరుపతితో పాటు దేశ వ్యాప్తంగా 233 కేంద్రాల్లో ప్రముఖ పండితులు తిరుప్పావై ప్రవచనాలు చేయనున్నారు. 15న సాయంత్రం 5.30 గంటలకు తిరుపతిలోని అన్నమాచార్య కళా మందిరంలో తిరుప్పావై ప్రవచనాల‌ ప్రారంభ సమావేశం జరుగనుంది. టీటీడీ ఆళ్వార్‌ దివ్య ప్రబంధ ప్రాజెక్టు ఆధ్వర్యంలో ఇందు కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి. తిరుమ‌ల శ్రీశ్రీశ్రీ‌ పెద్దజీయర్ స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్ స్వామి, ఇత‌ర అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ సందర్భంగా ఆచార్య చక్రవర్తి రంగనాథన్ తిరుప్పావై ప్రవచనం చేస్తారు.

ధనుర్మాసం ముగిసే వరకు తిరుమ‌ల‌లోని నాద నీరాజనం వేదిక, తిరుపతిలోని అన్నమాచార్య కళా మందిరం, కెటి రోడ్డులోని శ్రీ వరదరాజ స్వామివారి ఆలయం, శ్రీ గోవిందరాజ స్వామివారి ఆలయం దక్షిణ మాడ వీధిలోని శ్రీ లక్ష్మీ నారాయణ స్వామివారి ఆలయం, శ్రీ గోవిందరాజ స్వామి వారి తేరుకు సమీపంలోని తొలప్ప మండపం, రామ్ నగర్ క్వార్టర్స్ వద్ద ఉన్న గీతా మందిరం, ఎల్ ఎస్ నగర్ లోని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆల‌యంలో ప్రతిరోజు తిరుప్పావై ప్రవచనాల పారాయణం జరుగుతుంది. అదే విధంగా ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, పాండిచ్చేరి, మ‌హారాష్ట్ర‌, ఒడిశా రాష్ట్రాల్లోని 233 కేంద్రాల్లో తిరుప్పావై ప్రవచన కార్యక్రమాలు జరుగనున్నాయని వెల్ల‌డించారు టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్.

Exit mobile version