అనకాపల్లి జిల్లా : ఏపీ రాష్ట్ర హోం శాఖ మంత్రి అనిత వంగలపూడి కీలక వ్యాఖ్యలు చేశారు. టీడీపీకి కార్యకర్తలే ముఖ్యమని, వారే అసలైన వారసులు, అధినేతలని ప్రశంసించారు. నక్కపల్లి మండలం బోదుగల్లం గ్రామంలో ఘనంగా తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవం జరిగింది. తెలుగుదేశం పార్టీ జెండా ఎగుర వేశారు. అనంతరం ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. పెద్ద సంఖ్యలో పాయకరావుపేట నియోజకవర్గ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కార్యకర్తల వద్దకు వెళ్లి ఆప్యాయంగా పలకరించారు మంత్రి అనిత. నాయకులు,కార్యకర్తలతో ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా పార్టీ సీనియర్ కార్యకర్తలను సత్కరించచారు.
బోదుగల్లం గ్రామంలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగుర వేయడం చాలా సంతోషంగా ఉందన్నారు వంగలపూడి అనిత. తెలుగుదేశం పార్టీలో కార్యకర్తలే ముఖ్యం అన్నారు. కార్యకర్తలు బలంగా ఉంటే, ఆ పార్టీ మరింత పటిష్టంగా ఉంటుందన్నారు. 44 సంవత్సరాలు పాటు తెలుగుదేశం పార్టీ విజయవంతంగా కొనసాగుతుందంటే కార్యకర్తల వల్లే సాధ్యమైందన్నారు . యుగ పురుషుడు ఎన్టీ రామారావు. సినీ వినీల ఆకాశంలో రారాజు ఎన్టీఆర్. ఎన్టీ రామారావు రాజకీయాల్లోకి రావడం తెలుగు ప్రజలు చేసుకున్న పూర్వజన్మ సుకృతం అన్నారు వంగలపూడి అనిత. ఎన్టీఆర్ రాజకీయాల్లో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చారని గుర్తు చేశారు. తెలుగుదేశం పార్టీ స్థాపించిన తర్వాత విద్యావంతులు రాజకీయాల్లోకి వచ్చారని అన్నారు. ఆస్తిలో సమాన వాటా హక్కు ఆడపిల్లలకి ఇచ్చింది, మహిళలకు రాజకీయ ప్రాధాన్యత కల్పించింది కూడా ఎన్టీఆరేనని అన్నారు.
