అనకాపల్లి : ఉత్తరాంధ్ర ఇలవేల్పు, రాష్ట్ర పండుగగా గుర్తింపు పొందిన అనకాపల్లి గవరపాలెంలోని శ్రీ నూకాంబిక అమ్మవారిని విశాఖ రేంజ్ ఐజీ గోపీనాథ్ జెట్టి దంపతులు దర్శించుకున్నారు. ఆలయానికి విచ్చేసిన ఐజీ దంపతులకు ఆలయ అధికారులు, అర్చకులు పూర్ణకుంభంతో ఘనస్వాగతం పలికారు.
అమ్మ వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఐజీ ఆలయ పరిసరాలను పరిశీలించి స్థానిక పోలీస్, ఆలయ అధికారులకు పలు కీలక సూచనలు చేశారు. రాబోయే 90 రోజుల పాటు భక్తుల రద్దీ విపరీతంగా ఉండే అవకాశం ఉన్నందున, క్యూ-లైన్ల వద్ద ఎటువంటి తోపులాటలు జరగకుండా పకడ్బందీగా నిర్వహించాలని ఆదేశించారు.
భక్తుల రక్షణ కోసం ఆలయ పరిసరాల్లోని సిసి కెమెరాల పనితీరును నిరంతరం పర్యవేక్షించాలని, కంట్రోల్ రూమ్ ద్వారా నిఘా పెంచాలని సూచించారు. ప్రస్తుతం ఎండ తీవ్రత పెరుగుతున్న దృష్ట్యా, క్యూ-లైన్లలో వేచి ఉండే భక్తులకు ఇబ్బంది కలగకుండా చల్లని తాగునీరు, మజ్జిగ సౌకర్యం కల్పించాలని మరియు నీడ కోసం షామియానాలు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.
ఆలయానికి వచ్చే రహదారుల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం కలగకుండా ముందస్తుగా ట్రాఫిక్ ప్రణాళికలు సిద్ధం చేయాలని స్పష్టం చేశారు. ఆలయ చైర్మన్ పీలా నాగ శ్రీను, సహాయ కమిషనర్ యాళ్ల శ్రీధర్ ఐజికి అమ్మవారి చిత్రపటాన్ని, ప్రసాదాన్ని అందజేసి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో అనకాపల్లి టౌన్ ఇన్ స్పెక్టర్ ప్రేమ్ కుమార్, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ వెంకట్ నారాయణ, ఎస్సై సంతోష్ కుమార్, ఆలయ ధర్మకర్తలు,ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
