పాలమూరు జిల్లా : నిత్యం వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ సంచలనంగా మారిన పాలమూరు జిల్లా జడ్చర్ల శాసన సభ సభ్యులు జనంపల్లి అనిరుధ్ రెడ్డి మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన ఏకంగా సీఎం సీటు గురించి మాట్లాడారు. గత కొన్నాళ్లుగా అసమ్మతి స్వరం వినిపిస్తూ వస్తున్నారు. వరుస వివాదాలకు కేంద్ర బిందువుగా మారారు. ఇప్పటికే రెడ్డి మంత్రులు వర్సెస్ బీసీ మంత్రి మధ్య వివాదం ఇంకా సమిసి పోక ముందే ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి ముఖ్యమంత్రి పదవిపై వ్యాఖ్యానించడం ఆసక్తికరంగా మారింది. రాష్ట్ర రాజకీయాలలో కలకలం రేపింది.
నిధుల కేటాయింపులో వివక్ష చూపుతున్నారని రాష్ట్ర వ్యాప్తంగా ఎమ్మెల్యేలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్న పరిస్థితుల్లో అనిరుధ్ రెడ్డి నేరుగా సొంత పార్టీ ప్రభుత్వంపై ఆరోపణలు చేశారు. అంతటితో ఆగకుండా రెండవసారి తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే ముఖ్యమంత్రి అభ్యర్థిని అవుతానంటూ వ్యాఖ్యలు చేసారు. మంత్రుల జిల్లాలు, నియోజకవర్గాలకే నిధులు వెళ్తున్నాయని ఆరోపించారు. తమను ఎమ్మెల్యేలుగా గెలిపిస్తేనే కదా తాము కూడా మంత్రులం, సీఎం అయ్యేదని అన్నారు. జడ్చర్ల అభివృద్ధి కోసం ఎంత వరకైనా వెళతానని స్పష్టం చేశారు. ఇంకో రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిపిస్తే తాను కూడా ముఖ్యమంత్రి అవుతానని చెప్పారు.
ఇదిలా ఉండగా ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలలో ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా తయారైంది. జిల్లా ఇంఛార్జి మంత్రిగా ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజ నరసింహ ఉన్నప్పటికీ కంట్రోల్ లేకుండా పోయిందన్న విమర్శలు ఉన్నాయి.
