హైదరాబాద్ : మాజీ మంత్రి కేటీఆర్ నిప్పులు చెరిగారు. ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి తీవ్రంగా స్పందించారు. ఈ రెండేళ్లలో తనను తీవ్రంగా వ్యక్తిత్వ హననం చేయాలని చూస్తన్నారంటూ, దీనికి ప్రధాన కారకుడు సీఎం రేవంత్ రెడ్డి అని ఆరోపించారు. తాను డ్రగ్స్ తీసుకుంటానని, తనకు హీరోయిన్స్‌తో సంబంధం ఉందని.. దిక్కుమాలిన వార్తలు రాసి నన్ను, నా కుటుంబాన్ని క్షోభకి గురిచేశారని ఆవేదన వ్యక్తం చేశారు కేటీఆర్. శనివారం కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. గత రెండేళ్లుగా ఈ ఫోన్ ట్యాపింగ్ పేరిట లీకుల రూపంలో నా వ్యక్తిత్వ హననం చేసారని మండిపడ్డారు. నేను హీరోయిన్ల ఫోన్ ట్యాప్ చేశా అని మీరే లీకులు ఇస్తారు, మళ్లీ అవి అబద్ధాలను మీరే రాస్తారు, మారి నా పరువు, ప్రతిష్టకు కలిగిన నష్టానికి ఎవరు బాధ్యులంటూ నిప్పులు చెరిగారు కేటీఆర్.
ఇవాళ రాష్ట్రంలో ఒక్క అధికారి అయినా ఈ ప్రభుత్వంలో ఫోన్ ట్యాపింగ్ జరగడం లేదని చెప్పడానికి ముందుకు వస్తారా అని ప్రశ్నించారు. ఫోన్ ట్యాపింగ్ విషయంలో నన్ను విచారణకు పిలిచారు. నేను వెళ్తాను. కానీ, నేను వారికి కొన్ని ప్రశ్నలు అడగదలుచుకున్నానని అన్నారు. గత రెండు సంవత్సరాలుగా డైలీ సీరియల్ మాదిరిగా లీకులు ఇస్తూ, నా వ్యక్తిత్వ హననం చేస్తున్న ఈ ప్రచారానికి ఒక్క సాక్ష్యం అయినా ఉందా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం మీడియా లీకులే తప్ప, ఒక్క అధికారిక సాక్ష్యం కూడా లేకుండా ఎందుకు ఇంత దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. లీకుల పేరుతో డ్రామాలాడుతున్న వారిని ఎవరినీ వదిలిపెట్టం అని హెచ్చరించారు.
