అమెరికా : అమెరికా మాజీ అధ్యక్షుడు, ఒబామా ఫౌండేషన్ అధ్యక్షుడు బరాక్ ఒబామా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను ఎల్లప్పుడూ యువత నుంచి స్పూర్తి పొందేందుకు ప్రయత్నం చేస్తానని చెప్పారు. తన ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఫౌండేషన్ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. కులం, మతం, ప్రాంతం, జాతులతో సంబంధం లేకుండా ఫౌండేషన్ ప్రతిభ ఆధారంగా ఎంపిక చేస్తూ ప్రోత్సహిస్తోందని చెప్పారు ఒబామా. ఈ ప్రపంచం యువతపై ఎన్నో ఆశలు పెట్టుకుని ఉందన్నారు. ఇవాళ కావాల్సింది యువతకు పట్టుదల అని అన్నారు. వినూత్నంగా ఆలోచించేందుకు కావాల్సిన వాతావరణాన్ని తాము ఏర్పాటు చేసేందుకు ప్రయత్నం చేస్తున్నట్లు చెప్పారు బరాక్ ఒబామా.
తాను కూడా ఈ స్థాయికి రావడానికి ఎన్నో అవమానాలు, మరెన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నానని చెప్పారు. చదువు ఒక్కటే మనల్ని ప్రత్యేకమైన వ్యక్తులుగా మార్చేలా చేస్తుందని అన్నారు మాజీ అధ్యక్షుడు. తమ ఫౌండేషన్ ప్రధానంగా విద్య, వైద్యం, ఉపాధి కల్పనపై ఎక్కువగా ఫోకస్ పెడుతుందని స్పష్టం చేశారు. తాను యువతీ యువకులను ప్రేమిస్తూనే ఉంటానని అన్నారు. ఎందుకంటే బాల్యం ముఖ్యమైనదని అన్నారు. ప్రస్తుతం యువత ప్రపంచంలోని అత్యంత తీవ్రమైన సవాళ్లను ఎదుర్కొంటోందని స్పష్టం చేశారు బరాక్ ఒబామా.
రాబోయే రోజుల్లో యువతలో ఆత్మ విశ్వాసం పెంపొందించేలా బరాక్ ఒబామా ఫౌండేషన్ ప్రయత్నం చేస్తుందని పేర్కొన్నారు. టెక్నాలజీతో పాటు మానవత్వం కలిగి ఉండాలని సూచించారు. వ్యవస్థలను అర్థం చేసుకోకుండా ముందుకు వెళ్లలేమని అన్నారు ఒబామా.
















