ముంబై : ప్రముఖ బాలీవుడ్ నటి దీపికా పదుకొనే సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు రెమ్యూనరేషన్ విషయంలో తీవ్ర అభ్యంతరాలు ఉన్నాయని పేర్కొన్నారు. సినీ ఇండస్ట్రీలో హీరో , హీరోయిన్ల మధ్య పారితోషకం విషయంలో తేడాలు ఉన్నాయంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఆమె బహిరంగంగానే ఓ హీరో పేరు ఎత్తకుండానే సెటైర్ వేశారు. “నాకంటే తక్కువ సక్సెస్ రేట్ ఉన్న హీరోకి అంతకంటే ఎక్కువ పారితోషికమా?” – పారితోషికం విషయంలో వివాదం కారణంగా ఒక సినిమా నుంచి ఇటీవలే తప్పుకుంది. దీనిపై చర్చ కొనసాగుతోంది.
భారతీయ చలనచిత్ర పరిశ్రమలో అగ్రశ్రేణి నటి దీపికా పదుకొణె చేసిన సంచలన వ్యాఖ్యల తర్వాత స్టార్ హీరోయిన్ల పారితోషికం , ‘లింగ ఆధారిత వేతన వ్యత్యాసం’ (స్త్రీ, పురుష నటీనటుల మధ్య పారితోషికంలో ఉండే తేడా) అనే అంశాలు కలకలం రేపుతు్నాయి. సమాన వేతనం ఇచ్చేందుకు నిరాకరించడంతో తాను ఒక భారీ ప్రాజెక్ట్ నుండి ఎలా తప్పుకున్నానో ఆమె బహిరంగంగా వెల్లడించారు. “నేను ఇటీవల ఒక భారీ సినిమా నుంచి తప్పుకున్నాను. అప్పటికే ఆ సినిమా కోసం ఒక స్టార్ హీరోని ఖరారు చేశారు. ఆ హీరోకి నిర్మాతలు ఎంత భారీ పారితోషికం ఇస్తున్నారో నాకు కచ్చితంగా తెలుసు. నిజం చెప్పాలంటే ప్రస్తుతం మార్కెట్‌లో ఆ హీరో కంటే మెరుగైన సక్సెస్ రేట్‌తో నేను దూసుకు పోతున్నాను. అందుకే, ‘నా పారితోషికం ఇంత’ అని చెప్పి, నా మార్కెట్ విలువకు తగిన వేతనాన్ని డిమాండ్ చేశాను. కానీ అంత బడ్జెట్ లేదని నిర్మాతలు చెప్పారు. దాంతో ఏమాత్రం ఆలోచించకుండా నేను ఆ సినిమా నుంచి తప్పుకున్నాను.”
చిత్ర పరిశ్రమలో హీరోయిన్లకు దక్కాల్సిన గుర్తింపు , సమాన గౌరవం లభించాలనే ఉద్దేశంతోనే తాను ఈ నిర్ణయం తీసుకున్నానని దీపికా పదుకొనే స్పష్టం చేశారు. స్టార్ హీరోల కంటే ఎక్కువ క్రేజ్ , బలమైన సక్సెస్ ట్రాక్ రికార్డ్ ఉన్నప్పటికీ, పారితోషికం విషయంలో జరుగుతున్న వివక్షపై తాను చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పరిశ్రమలో హాట్ టాపిక్‌గా మారాయి.
