అక్ర‌మార్కుల‌కు హైడ్రా చెక్ 106 ఎక‌రాలు సేఫ్

కోట్లాది రూపాయ‌లు విలువ చేసే స్థ‌లాలు ఆక్ర‌మ‌ణ

hellotelugu-HYDRAA

సికింద్రాబాద్ : హైడ్రా దూకుడు పెంచింది. అక్ర‌మార్కుల గుండెల్లో రైళ్లు పెట్టిస్తోంది. సికింద్రాబాద్ కంటోన్మెంట్‌లోని మేడ్చ‌ల్‌ – మ‌ల్కాజిగిరి, హైద‌రాబాద్ జిల్లాల ప‌రిధిలో 106 ఎక‌రాల ప్ర‌భుత్వ భూమిని కూడా క‌బ్జాదారులు వాటాలేసుకుని కాజేయాల‌ని ప్ర‌య‌త్నించారు. కంటోన్మెంట్ ప్రాంతంలో గ‌ల‌ జీఎల్ ఆర్ ( జ‌న‌ర‌ల్ ల్యాండ్ రిజిస్ట‌ర్‌) నంబ‌రు 243, 255ల‌లో ఉన్న 106 ఎక‌రాల ప్ర‌భుత్వ భూమిలోకి వేరే స‌ర్వే నంబ‌ర్ల‌తో ఎంట‌ర్ అయి ఏకంగా లే ఔట్ వేసేశారు. అక్క‌డ ప‌ర్యావ‌ర‌ణానికి తూట్లు పొడుస్తూ స‌హ‌జ‌సిద్ధంగా ఉన్న కొండ‌ల‌ను పేల్చుతూ వ‌ణ్య‌ప్రాణుల మ‌నుగ‌డ‌కు భంగం క‌లిగించారు. చిట్టి అడివిని త‌ల‌పించే విధంగా ఉన్న ప‌చ్చ‌ని గుట్ట‌ల్లో నెమ‌ళ్లు భ‌యంతో నివాస ప్రాంతాల్లోకి ఎగిరి వెళ్లే విధంగా అక్క‌డ కొండ‌ల‌ను పేల్చిన ఘ‌ట‌న‌ల‌పై స్థానికులు హైడ్రా ప్ర‌జావాణిలో ఫిర్యాదు చేశారు.

ప‌లు నిర్మాణ సంస్థ‌లు లే ఔట్‌లు వేసి ప్లాట్లుగా విక్ర‌యించ‌డానికి చేసిన ప్ర‌య‌త్నాల‌కు హైడ్రా చెక్ పెట్టింది. ప్రికాస్ట్ ఇటుక‌ల‌తో ప్ర‌హ‌రీలు నిర్మించి ఆక్ర‌మ‌ణ‌ల ప‌ర్వానికి తెర‌లేప‌గా.. వాటిని తొల‌గించి 106 ఎక‌రాల చుట్టూ హైడ్రా ఫెన్సింగ్ వేసింది. దీంతో స్థానికులు సంబ‌రాలు చేసుకున్నారు. పెద్ద ఎత్తున హైడ్రాకు మ‌ద్ధ‌తుగా ర్యాలీలు తీశారు. ట‌పాసులు పేల్చి హైడ్రా జిందాబాద్ అంటూ ప్ర‌భుత్వానికి అనుకూలంగా నినాదాలు చేశారు. రంగారెడ్డి జిల్లా బ‌హ‌దూర్‌గూడ‌లోని శంషాబాద్ విమానాశ్ర‌య ర‌న్‌వేకు ద‌క్షిణ భాగంలో ఉన్న 650 ఎక‌రాల భూమికి ఆనుకుని ఓ ఆర్ ఆర్ కూడా ఉండ‌డంతో ఈ భూముల‌పై రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారుల క‌న్ను ప‌డింది. అంతే రైతుల ద‌గ్గ‌ర రూ. ల‌క్ష‌ల్లో కొనేసి.. రూ. కోట్ల విలువైన భూమిని కాజేయాల‌ని ప్ర‌య‌త్నాలు ముమ్మ‌ర‌మ‌య్యాయి.

ఇప్ప‌టికే చాలామంది రైతులు అమ్ముకుని వెళ్లిపోయారు. 1954 ఖాస్రా ప‌హాణీ ప్ర‌కారం సర్వే నంబర్లు 25, 26లో ఉన్న 650 ఎక‌రాలు ప్రభుత్వ భూమిగా రికార్డులు చెబుతున్నాయి. 2002–2006లో అసిస్టెంట్ డైరెక్టర్, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ ఆధ్వర్యంలో “ఎంజాయ్‌మెంట్ సర్వే” నిర్వహించి, భూముల ఆక్రమణలను రెవెన్యూ రికార్డులతో సరిపోల్చే ప్రయత్నం చేశారు. క్రమబద్ధీకరించే ప్రతిపాదనను ప్రభుత్వం వద్దకు పంపినా, 2006లో సీసీఎల్ఏ తిరస్కరించింది. అభివృద్ధి చెందిన ప్రాంతం కావడంతో భూముల కేటాయింపుపై నిషేధం ఉందని పేర్కొంది. దీంతో క్రమబద్ధీకరణ అంశం పూర్తిగా ముగిసిన అంశంగా రికార్డుల‌కెక్కింది. ప్రస్తుతం కూడా ప్రభుత్వం తమదిగా పేర్కొంటున్న భూముల్లో గ్రామ‌స్తుల‌తో పాటు.. ప‌లువురు ఫామ్ హౌస్‌లు క‌ట్టుకుని వ్య‌వ‌సాయం చేస్తూ కొన‌సాగుతున్నారు. ఈ మేర‌కు వారిని ఖాళీ చేయించి ప్ర‌భుత్వ భూమి చుట్టూ ఫెన్సింగ్ వేసి హైడ్రా కాపాడింది.

Exit mobile version