HYDRAA : హైదరాబాద్ – రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం మాదాపూర్ ప్రాంతంలోని జూబ్లీ ఎన్‌క్లేవ్‌లో పార్కులతో పాటు రహదారుల ఆక్రమణలను గురువారం తొలగించింది. 22.20 ఎకరాలలో దాదాపు 100 ప్లాట్లతో అనుమతి పొందిన ఈ లే ఔట్‌లో 4 పార్కులుండగా 2 కబ్జా (దాదాపు 8 వేల 500 గజాలు)కు గురయ్యాయి. అలాగే 5 వేల గజాల మేర రోడ్డు కూడా కబ్జా అయ్యింది. వీటికి తోడు దాదాపు 300ల గజాల ప్రభుత్వ స్థలంలో అక్రమంగా వెలిసిన హోటల్ షెడ్డును కూడా హైడ్రా (HYDRAA) తొలగించింది. ఇలా మొత్తం 16000 గజాల స్థలాన్ని హైడ్రా కాపాడింది. దీని విలువ దాదాపు రూ. 400ల కోట్ల వరకు ఉంటుంది. 1995లో అనుమతి పొందిన ఈ లేఔట్ ను 2006లో ప్రభుత్వం రెగ్యులరైజ్ కూడా చేసింది. ఈ లే ఔట్ ప్రకారం GHMCకి గిఫ్ట్ డీడ్ చేసిన పార్కులను జైహింద్‌రెడ్డి అనే వ్యక్తి కబ్జా చేశారంటూ జూబ్లీ ఎన్‌క్లేవ్ లే ఔట్ ప్రతినిధులు హైడ్రా ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు.
HYDRAA Key Updates
ఈ ఫిర్యాదుపై క్షేత్ర స్థాయిలో విచారించిన హైడ్రా అధికారులు కబ్జాలు వాస్తవమే అని నిర్ధారించుకున్నారు. హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ఆదేశాల మేరకు వాటిని తొలగించారు. హైడ్రా ఏసీపీ శ్రీకాంత్ , ఇన్స్పెక్టర్లు రాజశేఖర్, బాలగోపాల్ నేతృత్వంలో ఈ కూల్చివేతలు జరిగాయి. వెను వెంటనే పార్కు స్థలాన్ని హైడ్రా కాపాడినట్టు సూచిస్తూ బోర్డులు కూడా పెట్టారు. పార్కులు, ప్రభుత్వ స్థలం చుట్టూ ఫెన్సింగ్ కూడా ఏర్పాటు చేసారు. కబ్జాకు పాల్పడ్డ వారిపై పోలీస్ కేసులు కూడా పెడుతున్నట్టు హైడ్రా అధికారులు తెలిపారు. లే ఔట్ ప్రకారం ఉన్న 4 పార్కుల్లో 2 పార్కులు, ఒక రహదారి, ప్రభుత్వ స్థలం కబ్జాకు గురైనట్టు వెల్లడి కావడంతో ఈ మేరకు చర్యలు తీసుకుంది.
హైటెక్ సిటీ నుంచి కొండాపూర్ రహదారికి ఆనుకొని మెటల్ చార్మినార్ కు ఎదురుగా దాదాపు 300ల గజాల ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి, అనుమతి లేకుండా హోటల్ నిర్మించి అద్దెలను జైహింద్‌రెడ్డి పొందుతున్నాడని గుర్తించారు. అదే స్థలంలో భారీ ప్రకటనల హోర్డింగ్ కూడా పెట్టి రెండింటి ద్వరా నెలకు రూ. 4 లక్షల వరకూ ఆదాయం పొందుతున్నాడని జూబ్లీ ఎన్‌క్లేవ్ ప్రతినిధులు ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రభుత్వ స్థలంలో హోటల్‌ను నిర్మించి అద్దె వసూలు చేస్తున్న వైనంపై గతంలో జీహెచ్ ఎంసీ నోటీసులు కూడా ఇచ్చిన విషయాన్ని పరిశీలించారు.
Also Read : India Shocking Nepal : లిపులేఖ్ పాస్ వివాదంపై కేంద్ర కీలక వ్యాఖ్యలు

















