క‌బ్జాదారుల ప్ర‌య‌త్నాల‌కు హైడ్రా చెక్

మంచిరేవుల గ్రామంలో చెరువు క‌బ్జా

hellotelugu-HYDRAA

రంగారెడ్డి జిల్లా : హైడ్రా దూకుడు పెంచింది. క‌బ్జాదారుల‌కు కోలుకోలేని షాక్ ఇచ్చింది. రంగారెడ్డి జిల్లా గండిపేట మండ‌లం మంచిరేవుల గ్రామంలో ఏకంగా చెరువును మాయం చేసేయాల‌ని చూసిన క‌బ్జాదారుల ప్ర‌య‌త్నాల‌ను హైడ్రా అడ్డుకుంది. క‌బ్జాదారులు కూడా సాధార‌ణ వ్య‌క్తులు కాదు.. బ‌డా నిర్మాణ సంస్థ‌లు. 8.24 ఎక‌రాల నాగిరెడ్డి కుంట‌కు న‌లువైపులా క‌బ్జాల‌కు తెర‌దీశారు. గ్రామ‌, రెవెన్యూ రికార్డుల్లో చెరువుగా స్ప‌ష్ట‌మైన ఆధారాలున్నాయి. 8.24 ఎక‌రాల చెరువుగా హెచ్ ఎం డీ ఏ గుర్తించింది. చెరువు క‌నిపించ‌కుండా ఏకంగా 20 ఫీట్ల టిన్ షీట్స్‌తో ప్ర‌హ‌రీ నిర్మించి 4 ఎక‌రాల‌కు బ‌డా రియ‌ల్ ఎస్టేట్ సంస్థ ఫెన్సింగ్ వేసింది. 20 ఫీట్ల రేకుల గోడ క‌ట్టి లోప‌ల చెరువు ఉంద‌నేది కూడా తెలియ‌కుండా ఆక్ర‌మ‌ణ‌ల‌కు తెగ‌బ‌డింది ఆ సంస్థ‌.

మ‌రో వైపు ఇంకో నిర్మాణ సంస్థ 3 ఎక‌రాలను క‌బ్జా చేసింది. స్థానిక మాజీ ప్ర‌జాప్ర‌తినిధి కూడా ఎక‌రానికిపైగా క‌బ్జా చేసి వేరేవాళ్ల‌కు అమ్మేశారు. ఇలా 8.24 ఎక‌రాల చెరువును క‌బ్జా చేసి అమ్ముకునే ప్ర‌య‌త్నాల‌ను హైడ్రా అడ్డుకుంది. ప్లాట్లుగా మార్చుకొని ప్రీకాస్ట్ ఇటుక‌ల‌తో ప్ర‌హ‌రీలు నిర్మించి అందులో తాత్కాలిక గ‌దులు నిర్మించి ఉంటే.. వాటిని హైడ్రా పూర్తిగా తొల‌గించింది. చెరువు చుట్టూ ఫెన్సింగ్ వేసి.. హైడ్రా బోర్డులు ఏర్పాటు చేసింది. 8.24 ఎక‌రాల నాగిరెడ్డికుంట క‌బ్జాల‌కు గురైంద‌ని స్థానికులు ఇచ్చిన ఫిర్యాదుల మేర‌కు క్షేత్ర‌స్థాయిలో సంబంధిత అధికారుల‌తో ప‌రిశీలించి.. ఈ మేర‌కు చ‌ర్య‌లు తీసుకుంది. హైడ్రాకు ఫిర్యాదు చేసిన వెంట‌నే చ‌ర్య‌లు తీసుకోవడంతో నాగిరెడ్డి కుంట‌ను బ‌తికించుకున్నామ‌ని.. ఏమాత్రం ఆల‌స్యం అయినా శాశ్వ‌త నిర్మాణాలు వ‌చ్చేసేవ‌ని పేర్కొన్నారు. హైడ్రా చ‌ర్య‌ల‌ను అభినందించారు.

Exit mobile version