హైదరాబాద్ : తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. దేశంలోనే తొలిసారిగా ట్రాన్స్ జెండర్స్ ను గుర్తించడమే కాకుండా వారికి సమాజంలో ఓ గౌరవ ప్రదమైన ఉపాధిని కల్పించేలా చేసింది. ఈ మేరకు ప్రభుత్వ పోలీస్ శాఖలో హోం గార్డ్స్ గా నియమించింది. తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలోనే అత్యాధునిక నగర రవాణా వ్యవస్థల్లో ఒకటైన మెట్రో రైలులో ట్రాన్స్ జెండర్స్ ను సెక్యూరిటీ గార్డ్స్ గా నియమించింది. మూడు కారిడార్లలో 57 స్టేషన్లతో ప్రతిరోజూ సుమారు 5 లక్షల మంది ప్రయాణికులకు సేవలు అందిస్తోంది. వీరిలో మహిళలు సుమారు 30 శాతం మంది ఉండగా, వారి భద్రత, సౌకర్యం, విశ్వాసం మెట్రో రైలు వ్యవస్థకు అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది .
తెలంగాణ ప్రభుత్వం సమానత్వం, గౌరవం, సమాన అవకాశాల దృష్టితో, వివిధ ప్రజా సేవా రంగాల్లో ట్రాన్స్‌జెండర్ సిబ్బంది నియామకానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోంది. ఈ దిశగా, హైదరాబాద్ మెట్రో రైలు ఒక ప్రగతిశీలమైన, ప్రభావవంతమైన అడుగు వేసి, 20 మంది ట్రాన్స్‌జెండర్ సిబ్బందిని భద్రతా విభాగంలో నియమించింది. ప్రత్యేక శిక్షణ పూర్తి చేసిన ఈ సిబ్బంది మంగళవారం నుంచి ఎంపిక చేసిన మెట్రో స్టేషన్ లలో విధులు ప్రారంభించారు. ఈ చొరవతో మహిళా ప్రయాణికుల భద్రతా వాతావరణం మరింత బలపడటమే కాకుండా, సామాజిక సాధికారతకు ప్రతీకగా నిలుస్తుంది.
కాగా కొత్తగా నియమితులైన వారు జనరల్, మహిళలకు ప్రత్యేకంగా కేటాయించిన కోచ్‌లలో భద్రతా చర్యలు చేపట్టడం, ప్రయాణికులకు దిశానిర్దేశం చేయడం, సమాచారం, అవసరమైన సహాయం అందించడానికి అందుబాటులో ఉంటారు. ప్రయాణికులు సౌకర్యవంతంగా, సురక్షితంగా వెళ్లేలా స్కానర్ కార్యకలాపాలను పర్యవేక్షిస్తారు. స్ట్రీట్-లెవెల్, కాన్‌కోర్స్ భద్రత లో కూడా పాలు పంచుకుంటారు.
హైదరాబాద్ మెట్రో రైలు, ప్రయాణికులకు సురక్షితమైన, సమర్థవంతమైన మొబిలిటీని అందించడానికి కట్టుబడి ఉంది.















