హైదరాబాద్ : హైదరాబాద్ విముక్తి దినోత్సవాన్ని అధికారికంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు ఎంపీ ఈటల రాజేందర్. సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో ‘అల్లై బలై ఫౌండేషన్’ ఆధ్వర్యంలో మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ అధ్యక్షతన రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఎంపీ మాట్లాడారు. ఈ రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించడం ఒక సాహసోపేతమైన చర్య అన్నారు. అప్పట్లో కమ్యూనిస్ట్ నాయకత్వంలో జరిగిన విముక్తి పోరాటం కావచ్చు, రజాకార్ల అరాచకాలను అడ్డుకోవడానికి జరిగిన ‘ఆపరేషన్ పోలో’ కావచ్చు. ఏది ఏమైనప్పటికీ, 1948 సెప్టెంబర్ 17న మన గడ్డపై మనం ఎగురవేసింది మువ్వన్నెల జెండానేనని అన్నారు. కాబట్టి అదే మన స్వాతంత్ర దినోత్సవం. అదే మన విముక్తి దినోత్సవం అని పేర్కొన్నారు ఎంపీ.
దురదృష్టవశాత్తు తెలంగాణకు స్వేచ్ఛ లభించిన రోజును కూడా మనం జరుపు కోలేక పోయామన్నారు. ఉద్యమ సమయంలో ఇది ఎలాంటి న్యాయం అని మనం చర్చించుకున్నాం అన్నారు ఈటల రాజేందర్. తెలంగాణ ఏర్పడిన తర్వాత మనం దీనిని జరుపుకుంటామని అనుకున్నాం.. కానీ అధికారం కోసం సాగే రాజకీయాల్లో, స్వార్థం రాజ్యమేలే రాజకీయాల్లో కేవలం బుజ్జగింపు ధోరణులు తప్ప, నిజమైన రాజకీయ చిత్తశుద్ధి లేదని మరోసారి రుజువైందని ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్ రాష్ట్రంలో భాగంగా ఉండి భాషా ప్రాతిపదికన మహారాష్ట్ర, కర్ణాటకలో విలీనమైన ప్రాంతాలు స్వాతంత్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్నప్పుడు, మనం ఎందుకు జరుపు కోకూడదన్న మీ మాటలతో నేను 100% ఏకీభవిస్తున్నానని చెప్పారు.
ఒకప్పుడు ప్రతిపక్ష పార్టీల సలహాలు తీసుకుని మరీ ప్రజాహిత రాజకీయాలు నడిపే వారని గుర్తు చేసుకున్నారు. కానీ ఇవాళ అలాంటి పరిస్థితి లేకుండా పోయిందన్నారు. .
