హైదరాబాద్ : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన మరోసారి తన వల్లే హైదరాబాద్ అభివృద్ది చెందిందని పేర్కొన్నారు. హైదరాబాద్ లో ఏర్పాటైన ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ లో జరిగిన సమావేశంలో మాట్లాడారు సీఎం. కరోనా సమయంలో హైదరాబాద్ లోని జీనోమ్ వ్యాలీ ప్రపంచానికే వ్యాక్సీన్ అందించిందన్నారు. తన వల్లే ఇక్కడికి ఐటీ వచ్చిందన్నారు. ఆనాడే టెక్నాలజీ ఉపయోగాల గురించి గుర్తించి ప్రోత్సహించినట్లు తెలిపారు. రాజకీయ కారణాల వల్ల ఏపీ రెండు రాష్ట్రాలుగా విడిపోయినా గతంలో తీసుకున్న నిర్ణయాల వల్ల తెలుగు ప్రజల తలసరి ఆదాయాన్ని పెంచాయన్నారు . 2024 లో మళ్లీ ఏపీలో మేం అధికారంలోకి వచ్చే సమయానికి ఏపీ అంతా సర్వనాశనం అయ్యిందన్నారు. బ్రాండ్ పోయింది, వ్యవస్థలు సర్వనాశనం అయ్యాయి. విభజన కంటే దారుణంగా రాష్ట్ర పరిస్థితి తయారైందని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడే పరిస్థితికి వచ్చింది. కూటమిగా మళ్లీ కొన్ని ప్రోగ్రెసివ్ నిర్ణయాలు తీసుకున్నాం అని చెప్పారు చంద్రబాబు నాయుడు. సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలన లాంటి కీలకమైన నిర్ణయాలు వేగంగా తీసుకున్నామని, అందుకే ప్రస్తుతం పెట్టుబడుల్ని ఆకర్షించటంలో ఏపీ అగ్రస్థానంలో ఉందన్నారు. ఇప్పుడు ఇక క్వాంటం, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, డ్రోన్స్ లాంటివే భవిష్యత్ టెక్నాలజీలు అని స్పష్టం చేశారు. అందుకే స్పేస్, ఎలక్ట్రానిక్స్, డ్రోన్ సిటీలను ఏపీలో నిర్మిస్తున్నాం అని వెల్లడించారు. విద్యుత్ సంస్కరణలూ తీసుకు వస్తున్నాం అని ప్రకటించారు.



















