TTD : తిరుమల – తిరుమలలో టీటీడీ, దేవాదాయ శాఖ సంయుక్త సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. దేవాదాయ చట్టం ప్రకారం 9 శాతం కామన్ గుడ్ ఫండ్ టీటీడీ (TTD) నుంచి తీసుకోవచ్చని నిబంధనలు ఉన్నాయని అన్నారు మంత్రి ఆనం రామ నారాయణ రెడ్డి. అర్చక నిరుద్యోగులకు భృతి ఇస్తామన్నారు. రాష్ట్రంలో 590 మంది మొత్తం వేదపండితులు ఉన్నారని వారికి గౌరవ వేతనం కింద రూ.3 వేలు ఇస్తామన్నారు. టీటీడీలో అన్యమతస్తులు ఉన్నారనేది వాస్తవమేనని స్పష్టం చేశారు.
TTD Updates
ఈ కీలక సమావేశంలో ఆంధ్ర ప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రివర్యులు అనం రామ నారాయణ రెడ్డి, టీటీడీ (TTD) ఛైర్మన్ బీ.ఆర్.నాయుడు, ఈవో జె. శ్యామలరావు, దేవాదాయ శాఖ కార్యదర్శి వినయ్ చంద్ కలిసి దేవాదాయ శాఖ, టీటీడీ మధ్య పెండింగ్‌లో ఉన్న సంయుక్త అంశాలపై విస్తృతంగా చర్చించారు. ఇప్పటి వరకు తిరుమలలో చేపడుతున్న భవనాలను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు మంత్రి ఆనం రామ నారాయణ రెడ్డి. సుదూర ప్రాంతాల నుంచి శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని స్పష్టం చేశారు. త్వరిత గతిన దర్శన భాగ్యం కల్పించాలని, ఈ అవకాశం ఆ దేవ దేవుడు కల్పించిన అదృష్టంగా భావించాలని అన్నారు.
ఇదే సమయంలో కామన్ గుడ్ ఫండ్ (సీజీఎఫ్) నిధుల విడుదల, శ్రీవాణి ట్రస్ట్ నిధులతో నిర్మిస్తున్న ఆలయాల వివరాలు, ఆలయాల పునరుద్ధరణ పరిరక్షణ, వాటి పురోగతి తదితర ముఖ్యమైన అంశాలపై విస్తృతంగా చర్చించారు.ఈ సమావేశంలో టీటీడీ అదనపు ఈవో సి.హెచ్. వెంకయ్య చౌదరి, జేఈవో వీరబ్రహ్మం, దేవాదాయ శాఖ కమిషనర్ రామచంద్ర మోహన్ టీటీడీ చీఫ్ ఇంజినీర్ సత్యనారాయణ, దేవాదాయ శాఖ ఉపకార్యదర్శి సుధాకర్ రావు, ఏపీ దేవాదాయ శాఖ చీఫ్ ఇంజినీర్ జి.వి.ఆర్. శేఖర్, పలువురు టీటీడీ, దేవాదాయ శాఖ అధికారులు పాల్గొన్నారు.
Also Read : TTD EO Shyamala Rao Hopeful : తిరుమలలో అభివృద్ది పనులు పూర్తి చేయాలి



















