హైదరాబాద్ : ఐఏఎస్ కేడర్ స్థానాల్లో ఐపీఎస్ అధికారులను నియమించాలనే నిర్ణయంపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఇందుకు సంబంధించిన నిర్ణయంపై వివరణ కోరుతూ రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. ఐఏఎస్, ఐపీఎస్ కేడర్ల మధ్య చాలా కాలంగా ఆధిపత్య పోరు నడుస్తోంది. తిరిగి ఈ వివాదం మళ్లీ రాజుకుంది. సాంప్రదాయకంగా ఐఏఎస్ అధికారులకు రిజర్వు చేయబడిన స్థానాల్లో సీనియర్ IPS అధికారులను నియమించాలనే రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని సవాలు చేస్తూ రిట్ పిటిషన్ దాఖలైంది. తెలంగాణ హైకోర్టు ఇప్పుడు ఈ విషయాన్ని సింగిల్ జడ్జి బెంచ్ ద్వారా విచారిస్తోంది.
ఇదిలా ఉండగా సీనియర్ ఐపీఎస్ అధికారి అయిన సీవీ ఆనంద్ హోం శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా నియమితులు కాగా జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్‌మెంట్‌లో విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఎక్స్-అఫీషియో ప్రిన్సిపల్ సెక్రటరీ డైరెక్టర్ జనరల్ గా శిఖా గోయల్ ను నియమించారు. చట్ట ప్రకారం ఈ రెండు కీలక పదవులు ఐపీఎస్ లు కాకుండా ఐఏఎస్ లను నియమించాల్సి ఉంటుంది. దీంతో కేడర్ కు సంబంధించి సర్కార్ నిబంధనలు ఉల్లంఘించారంటూ ఐఏఎస్ లు కోర్టును ఆశ్రయించారు. రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వు ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (కేడర్) నియమాలు, 1954ను ఉల్లంఘిస్తుందని పిటిషనర్ వడ్ల శ్రీకాంత్ పేర్కొన్నారు, ఇది రాష్ట్ర స్థాయిలో IAS అధికారులకు కేడర్ నిర్వహణను నియంత్రిస్తుంది. నిర్దిష్ట పోస్టులను నిర్దేశిస్తుంది.
















