కాలుష్య నివార‌ణ‌పై టాస్క్ ఫోర్స్ విధులు ఇవే

ప్ర‌క‌టించిన ఏపీ కూట‌మి ప్ర‌భుత్వం

hellotelugu-APGovt

అమ‌రావ‌తి : డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఆదేశాల మేర‌కు ఏపీ స‌ర్కార్ కాలుష్య నియంత్ర‌ణ‌కు ప్ర‌త్యేకంగా ఓ టాస్క్ ఫోర్స్ క‌మిటినీ ఏర్పాటు చేసింది. ఈ టాస్క్ ఫోర్స్ నదిలోకి కలిసే మురుగునీరు, పారిశ్రామిక వ్యర్థాలను అరికట్టడంతో పాటు, శాశ్వత పర్యావరణ రక్షణ చర్యలను పర్యవేక్షించనుంది. ఈ ప్రత్యేక కమిటీకి పర్యావరణ, అటవీ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ చైర్మన్‌గా వ్యవహరించనుండగా, ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి మెంబర్ సెక్రటరీ కన్వీనర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తారు. పురపాలక పరిపాలన శాఖ కమిషనర్ అండ్ డైరెక్టర్ (సీడీఎంఏ), పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి కమిషనర్, పరిశ్రమల శాఖ కమిషనర్, వ్యవసాయ శాఖ కమిషనర్, మత్స్య శాఖ కమిషనర్, ఆంధ్రప్రదేశ్ టూరిజం అథారిటీ సీఈఓ, దేవాదాయ శాఖ కమిషనర్, జలవనరుల శాఖ ఇంజనీర్-ఇన్-చీఫ్, గ్రామీణ నీటి సరఫరా ఇంజనీర్-ఇన్-చీఫ్, క్లీన్ కృష్ణా, గోదావరి కెనాల్స్ మిషన్ డైరెక్టర్, గోదావరి పరివాహక ప్రాంత జిల్లాలైన తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కాకినాడ, కోనసీమ, పోలవరం జిల్లాల కలెక్టర్లు సభ్యులుగా ఉంటారు.

ఈ ప్రత్యేక కమిటీ ప్రతి15 రోజులకు ఒకసారి తప్పనిసరిగా సమావేశం అవుతుంది. గోదావరితోపాటు రాష్ట్రంలోని ఇతర ప్రధాన నదుల్లోకి కాలుష్యం ఎక్కడెక్కడ నుంచి చేరుతుందో క్షేత్రస్థాయిలో గుర్తిస్తుంది. గుర్తించిన సమస్యలకు కాలుష్య నియంత్రణ మండలి సూచనల ప్రకారం నివారణ చర్యలను తీసుకుంటూ పనుల ప్రగతిని పర్యవేక్షిస్తుంది. గోదావరి పుష్కరాల నాటికి భక్తులకు స్వచ్ఛమైన నదీ జలాలను అందించడమే లక్ష్యంగా ఈ టాస్క్ ఫోర్స్ పనిచేస్తుంది.

Exit mobile version