మెరుగైన జీవితానికి ఆరోగ్య‌క‌ర‌మైన అల‌వాట్లు అవ‌స‌రం

యువ‌త‌కు పిలుపునిచ్చిన క్రీడాకారిణి నైనా జైస్వాల్

hellotelugu-NainaJaiswal

హైద‌రాబాద్ : యువ‌త మ‌రింత ఎత్తుకు ఎద‌గాలంటే కావాల్సింది క్ర‌మ‌శిక్ష‌ణ‌తో పాటు ఆరోగ్య‌క‌ర‌మైన అల‌వాట్లు క‌లిగి ఉండాల‌ని స్ప‌ష్టం చేశారు ప్ర‌ముఖ క్రీడాకారిణి నైనా జైస్వాల్. హైద‌రాబాద్ లోని ప్ర‌ముఖ విశ్వ విద్యాల‌యం హైద‌రాబాద్ విశ్వ విద్యాల‌యంలో ఏర్పాటు చేసిన యూత్ ఫర్ ఇన్‌క్లూజివ్ అండ్ సస్టైనబుల్ సొసైటీ (YISS) యూత్ ఫెస్టివల్ 2026 లో పాల్గొని ప్ర‌సంగించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొని, మత్తు పదార్థాల వినియోగం వల్ల కలిగే హానిపై అవగాహన పెంపొందించడంతో పాటు, ఆరోగ్యకరమైన , సానుకూల జీవనశైలిని ప్రోత్సహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన అంతర్జాతీయ స్థాయి టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి , విద్యా ప్రతిభాశాలి డా. నైనా జైస్వాల్ విద్యార్థులను ఉద్దేశించి ప్రేరణాత్మక ప్రసంగం చేశారు. క్రమశిక్షణ, లక్ష్యసాధనతో ముందుకు సాగాలని, విజయవంతమైన జీవితానికి ఆరోగ్యకరమైన అలవాట్లు అవసరమని ఆమె సూచించారు. గౌరవ అతిథిగా హాజరైన రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్ ఆళ్ల రామకృష్ణ విద్యార్థులను ఉద్దేశించి మత్తు పదార్థాల దుష్ప్రభావాలను వివరించారు. వాటికి దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు. మత్తు పదార్థాలు వ్యక్తిగత ఆరోగ్యాన్ని మాత్రమే కాదు, కుటుంబాల స్థిరత్వాన్ని, సమాజంలోని శాంతి, అభివృద్ధిని కూడా దెబ్బతీస్తాయని ఆయన స్పష్టంచేశారు.

యువత తమ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని బాధ్యతాయుతంగా నిర్ణయాలు తీసుకోవాలని, సానుకూల ఆలోచనలు, క్రీడలు, సృజనాత్మక కార్యకలాపాల వైపు మళ్లాలని సూచించారు. అదేవిధంగా, ఒత్తిడులను ఎదుర్కొనే సమయంలో తప్పు మార్గాలను ఆశ్రయించకుండా, సరైన మార్గదర్శకత్వాన్ని పొందాలని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా YISS వ్యవస్థాపకుడు, ఆల్ ఇండియా ఓబీసీ స్టూడెంట్స్ అసోసియేషన్ జాతీయ అధ్యక్షుడు గౌడ్ కిరణ్ కుమార్ మాట్లాడుతూ జీవితాన్ని ఆనందంగా గడపడానికి అనేక సృజనాత్మక మార్గాలు ఉన్నాయని, మంచి అభిరుచులు, సానుకూల దృక్పథం ద్వారా సంతోషకరమైన జీవితం సాధ్యమని తెలిపారు. మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని విద్యార్థులను కోరారు.

Exit mobile version