కూటమి నాయకుల మధ్య సఖ్యత ముఖ్యం

స్ప‌ష్టం చేసిన ఐటీ, విద్యా శాఖ మంత్రి లోకేష్

hellotelugu-NaraLokesh

అమ‌రావ‌తి : కూటమి నాయకుల మధ్య సఖ్యత అత్యంత ముఖ్యమని రాష్ట్ర ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ స్ప‌ష్టం చేశారు. మంగ‌ళ‌గిరి లో జ‌రిగిన పార్టీ కీల‌క స‌మావేశంలో ఆయ‌న పాల్గొని ప్ర‌సంగించారు. కూటమిని చీల్చేందుకు కొన్ని శక్తులు ప్రయత్నిస్తున్నాయ‌ని, వారి ప్ర‌య‌త్నాలు ఫ‌లించ‌వ‌ని అన్నారు. త‌మ‌ను విడదీయడం ఎవరి తరం కాద‌న్నారు. గ్రామ స్థాయిలో కూటమి నేతలందరినీ కలుపుకుని కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. పార్టీ నాయకులు అలగడం తగదని, ప్రతి ఒక్కరి కష్టాన్ని పార్టీ తప్పకుండా గుర్తిస్తుందని లోకేష్ భరోసా ఇచ్చారు. తెలుగుదేశం పార్టీ ఒక కుటుంబం అని, సమస్యలు ఉంటే కూర్చొని మాట్లాడుకుంటే పరిష్కారం దొరుకుతుందని తెలిపారు.

గత వైసీపీ ప్రభుత్వం కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి, టీటీడీ ప్రతిష్ఠకు భంగం కలిగించే విధంగా వ్యవహరించిందని లోకేష్ తీవ్ర విమర్శలు చేశారు. చేయకూడని పాపాలు చేసి, ఇప్పుడు కూడా తప్పుడు ప్రచారాలతో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. వైసీపీ దుష్ప్రచారాలతో నిండిపోయిందని, తప్పుడు ప్రచారాలను వాస్తవాలతో తిప్పికొట్టండంతో పాటు ఆ వాస్తవాలను ప్రజలకు తెలియ జేయాల్సిన బాధ్యత పార్టీ కార్యకర్తలదేనని ఆయన స్పష్టం చేశారు. పార్టీ కోసం ప్రతి కార్యకర్త చేస్తున్న సేవలు, కష్టాలను మై టీడీపీ యాప్ ద్వారా పార్టీకి తెలియ జేయాలని సూచించారు నారా లోకేష్. ప్రతి ఒక్కరూ తమ మొబైల్‌లో యాప్‌ను తప్పనిసరిగా ఇన్‌స్టాల్ చేసుకోవాలని కోరారు. ఈ శిక్షణ తరగతులు పార్టీని మరింత బలోపేతం చేయడంలో కీలకంగా మారతాయని లోకేష్ ఆశాభావం వ్యక్తం చేశారు.

Exit mobile version