Harish Rao : హైదరాబాద్ : మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు (Harish Rao) నిప్పులు చెరిగారు. పంటలు పండించే పొలాలను రైతులకు కాకుండా చేసేందుకు కుట్రకు తెర లేపారంటూ ఆరోపించారు. సోమవారం తనను కలిసిన బాధిత రైతులతో ఆయన మాట్లాడారు. ఈ సందర్బంగా మీ తరపున సర్కార్ ను నిలదీస్తానని హామీ ఇచ్చారు. పాత ఆలైన్‌మెంట్ మార్పును నిరసిస్తూ హైదరాబాద్-శ్రీశైలం హైవేపై మాలేపల్లి, పోలేపల్లి, సింగంపల్లి, సంకటోనిపల్లి రైతులు సీఎం రేవంత్‌రెడ్డికి వ్యతిరేకంగా ఆందోళనలకు దిగినా ప్రభుత్వం మొద్దు నిద్ర వీడటం లేదన్నారు హరీశ్ రావు. నాడు ఫార్మా సిటీ వద్దు అన్నారు, నేడు మాట మార్చి పచ్చటి పొలాల్లో చిచ్చు బెట్టడం ఎంత వరకు సబబు అని ప్రశ్నించారు. గిరిజనుల బిడ్డలను జైళ్ల పాలు చేసింది నువ్వు కాదా అని నిలదీశారు.
MLA Harish Rao Slams Congress
నాడు రీజనల్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ మార్పు అన్నారు నేడు మాట మార్చి, నిర్బంధాల మధ్య భూసేకరణ కొనసాగిస్తున్నారని ఆరోపించారు. మాట మార్చడమే మీ విధానమా? ప్రజలను మభ్య పెట్టడమే కాంగ్రెస్ పద్దతా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. భువనగిరి లో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో ప్రియాంక గాంధీతో ఆర్ఆర్ఆర్‌లో భూములు కోల్పోయిన రైతులకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని చెప్పించిన విషయం మరిచి పోతే ఎలా అన్నారు. కానీ, అధికారంలోకి రాగానే బాధితుల పట్ల కర్కశంగా వ్యవహరిస్తూ తీవ్ర మానసిక క్షోభకు గురి చేస్తున్నారని ఆవేదన చెందారు హరీశ్ రావు.
ఇప్పటికైనా కళ్లు తెరిచి ఆర్ఆర్ఆర్ ప్రాజెక్టుపై రైతులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని, లేదంటే బాధితుల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. తన స్వలాభం కోసం అలైన్మెంట్ మారుస్తున్న రేవంత్‌కు రాష్ట్రంతో పాటు రైతుల ప్రయోజనాలు పట్టడం లేదన్నారు.పదే పదే అలైన్మెంట్ మారుస్తుండటంతో కేంద్రం ఆర్ఆర్ఆర్‌ను తిరస్కరించే పరిస్థితి వచ్చిందన్నారు. సొంత డబ్బులతో ఆర్ఆర్ఆర్ చేపడితే అది ఖజానాకు పెను భారం కాదా ఆ మాత్రం సోయి లేక పోతే ఎలా అని నిలదీశారు. సొంత భూముల కోసం అలైన్మెంట్లు మార్చడం వల్ల వేలకోట్ల భారం రాష్ట్ర ప్రజలపై పడుతుందన్నారు.
Also Read : KTR Fired on Congress Govt : సర్కార్ నిర్లక్ష్యం విద్యార్థులు చదువుకు దూరం
