హ‌నుమంత వాహ‌నంపై కోదండ రాముడు

శ్రీ క‌ల్యాణ వేంక‌టేశ్వ‌ర స్వామి బ్ర‌హ్మోత్స‌వాలు

hellotelugu-HanumanthaVahanam

తిరుపతి : శ్రీనివాస మంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు ఘ‌నంగా జ‌రుగుతున్నాయి. ఆరో రోజైన శుక్ర‌వారం శ్రీనివాసుడు శ్రీ కోదండ రాముడి అలంకారంలో హనుమంత వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం 8 నుండి 9 గంటల వరకు స్వామివారు నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. వాహనసేవ ముందు గజ రాజులు నడుస్తుండగా, భక్తజన బృందాలు చెక్క భజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవా యిద్యాల నడుమ స్వామివారి ఉత్సవం కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు.

బ్రహ్మోత్సవాలలో ఆరో రోజు ఉదయం స్వామివారు కోదండ వేంకటరాముడై హనుమంతునిపై ఆసీనుడై భక్తులను అనుగ్రహించారు. శ్రీవారు త్రేతాయుగంలో శ్రీరాముడై అవతరించాడు. ఈ ఉత్సవంలో వాహనంగా హనుమంతుడిని, వాహనాన్ని అధిష్టించిన కల్యాణ వేంకటరాముడిని దర్శించడం వల్ల భోగమోక్షాలు, జ్ఞానవిజ్ఞానాలు, అభయారోగ్యాలు కలుగుతాయి. కాగా మధ్యాహ్నం 2 నుండి 3 గంటల వరకు శ్రీవారి కల్యాణ మండపంలో వసంతోత్సవం ఘ‌నంగా నిర్వ‌హించారు. అనంత‌రం సాయంత్రం 4 నుండి 5 గంట‌ల వ‌ర‌కు స్వర్ణ రథోత్స‌వ‌ము వైభ‌వంగా జరిగింది. రాత్రి 8 నుండి 9 గంటల వరకు గజవాహనంపై స్వామివారు భక్తులకు దర్శనం ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో వరలక్ష్మి, ఏఈవో గోపినాథ్‌, సూపరింటెండెంట్ ర‌మేష్‌, కంకణభట్టర్‌ బాలాజీ రంగాచార్యులు, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్ మునికుమార్‌, ధ‌న శేఖ‌ర్‌, ఆలయ అర్చకులు, ఇతర అధికారులు, విశేష సంఖ్య‌లో భ‌క్తులు పాల్గొన్నారు.

Exit mobile version