హనుమంత వాహనంపై సీతా రాముడి విహారం

శ్రీ కోదండ రామ స్వామి వార్షిక బ్ర‌హ్మోత్స‌వాలు

hellotelugu-haanumanthaSeva

ఒంటిమిట్ట / తిరుపతి : ఒంటిమిట్టలోని శ్రీ కోదండ రామస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగ‌రంగ వైభ‌వోపేతంగా కొన‌సాగుతున్నాయి. ఉత్స‌వాల‌లో భాగంగా రాత్రి విశేషమైన హనుమంత వాహన సేవ వైభవంగా జరిగింది. శ్రీ సీతా రామ లక్ష్మణులు తమ ప్రియ భక్తుడైన హనుమంతుని వాహనాన్ని అధిరోహించి పుర వీధుల్లో భక్తులకు దర్శనం ఇచ్చారు. రాత్రి 7 గంటల నుంచి కేరళ డ్రమ్స్‌, భక్తజన బృందాల చెక్క భజనలు, కోలాటాలతో స్వామి వారిని కీర్తిస్తూ, మంగళ వాయిద్యాల నడుమ వాహనసేవ ఘనంగా కొనసాగింది. భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించి భక్తిశ్రద్ధలతో స్వామి వారిని దర్శించుకున్నారు.

త్రేతాయుగంలో రామ భక్తునిగా, భగవద్భక్తులలో అగ్రగణ్యుడిగా ప్రసిద్ధిగాంచిన హనుమంతుడు దాస భక్తికి ప్రతీకగా నిలిచారు. రాముడు హనుమంతునికి ఆత్మ తత్వాన్ని బోధించినట్లు ప్రాచీన వాఙ్మయం ద్వారా తెలుస్తోంది. భక్తులకు ఆత్మోన్నతిని ప్రసాదించే హనుమంతుని సేవాభావాన్ని స్మరించుకుంటూ స్వామివారు హనుమంత వాహనంపై ఊరేగారు. ఉత్స‌వాల‌ను పుర‌స్క‌రించుకుని తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం పాల‌క మండ‌లి (టీటీడీ) ఆధ్వ‌ర్యంలో భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు. వేలాది మంది భ‌క్తులు ఉత్స‌వాల‌కు వ‌స్తున్నారు. మ‌రో వైపు ప్ర‌తి ఏటా రాష్ట్ర ప్ర‌భుత్వం త‌ర‌పున సీఎం దంప‌తులు ప‌ట్టు వ‌స్త్రాలు స్వామి వారి క‌ళ్యాణోత్స‌వం సంద‌ర్బంగా స‌మ‌ర్పించ‌డం ఆన‌వాయితీగా వ‌స్తోంది.

ఈ వాహన సేవలో డెప్యూటీ ఈఓ ప్ర‌శాంతి, సూపరింటెండెంట్ హనుమంతయ్య, టెంపుల్ ఇన్స్పెక్టర్ నవీన్, ఆలయ అర్చకులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

Exit mobile version