తిరుమల : తిరుమల శ్రీవారి ఆలయంలో శ్రీరామనవమి ఆస్థానాన్ని పురస్కరించుకొని సాయంత్రం 6.30 నుండి 8 గంటల వరకు శ్రీరాముల వారు తన భక్తుడైన హనుమంతునిపై తిరుమాడ వీధులలో ఊరేగుతూ భక్తులను అనుగ్రహించారు. హనుమంతుడు భగవత్ భక్తులలో అగ్రగణ్యుడు. రామాయణంలో మారుతి స్థానం అద్వితీయం. చతుర్వేద నిష్ణాతుడుగా, నవవ్యాకరణ పండితుడుగా, లంకాభీకరుడిగా ప్రసిద్ధుడైన ఆంజనేయుడు వేంకటాద్రివాసుని మూపున వహించి తిరువీధులలో దర్శనం ఇవ్వడం భక్తులను ఆనంద పరవశులను చేసింది. గురు శిష్యులై శ్రీరామ హనుమంతులు తత్త్వ వివేచన గావించిన మహనీయుడు కనుక వాహ్య వాహక రూపంలో ఈ ఇరువురినీ చూసిన వారికి వేదాలతత్త్వం ఒనగూరుతుంది.
అనంతరం రాత్రి 9 నుండి 10 గంటల నడుమ బంగారు వాకిలి చెంత శ్రీరామ నవమి ఆస్థానాన్ని వేడుకగా నిర్వహించారు. ఇదిలా ఉండగా శ్రీరామ నవమి పర్వదినం సందర్బంగా తిరుమల తిరుపతి దేవస్తానం పాలక మండలి (టీటీడీ) ఆధ్వర్యంలో భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు. సుదూర ప్రాంతాల నుంచి తరలి వచ్చారు భక్తులు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంది పాలకమండలి. ఈ కార్యక్రమంలో అదనపు కార్యనిర్వహణ అధికారి సి.హెచ్.వెంకయ్య చౌదరి, ఇతర అధికారులు పాల్గొన్నారు. మరో వైపు తిరుపతి జిల్లాలో ప్రసిద్ది చెందిన ఒంటిమిట్ట లోని శ్రీ కోదండ రామస్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు నభూతో నభవిష్యత్ అన్న రీతిలో ప్రారంభం అయ్యాయి. భక్త బాంధవులకు రఘు రాముడు కరుణించాడు.
