తిరుమల : ప్రతి సంవత్సరం వైశాఖ మాసం బహుళ దశమి నాడు తిరుమల క్షేత్రంలో ఘనంగా నిర్వహించే హనుమంతుడి జయంతి వేడుకలు ఈ ఏడాది మే 12వ తారీఖున తిరుమల తిరుపతి దేవస్తానం పాలక మండలి (టీటీడీ ) అత్యంత వైభవంగా నిర్వహించనుంది. శ్రీవారి ఆలయానికి ఎదురుగానున్న శ్రీ బేడి ఆంజనేయ స్వామి వారికి, కాలి నడక బాటలో ఏడవ మైలు వద్ద ఉన్న శ్రీప్రసన్న ఆంజనేయ స్వామి వారికి హనుమ జయంతి రోజు ప్రత్యేక పూజలు జరుగనున్నాయి. ఈ సందర్భంగా ప్రతి ఏటా ఘనంగా నిర్వహిస్తూ వస్తోంది టీటీడీ.
తిరుమలలోని జాపాలి తీర్థంలో కూడా హనుమజ్జయంతి ప్రతి సంవత్సరం నిర్వహిస్తోందని తెలిపింది.
ఈ సందర్భంగా సాంప్రదాయానుసారం టీటీడీ తరపున శ్రీ జపాలి హనుమాన్ కు పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. కాగా మొదటి ఘాట్‌రోడ్డులోని ఏడవ మైలు వద్ద ఉన్న శ్రీ ప్రసన్న ఆంజనేయస్వామి నిలువెత్తు విగ్రహానికి అదే రోజు సాయంత్రం 3 గంటలకు ప్రత్యేక పూజా కార్యక్రమాలను టీటీడీ నిర్వహిస్తుందని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు భక్తులు, స్థానికుల సౌకర్యార్థం తిరుమల నుండి ఏడో మైలుకు, తిరిగి తిరుమల చేరడానికి టీటీడీ ఉచిత రవాణా సౌకర్యాన్ని కూడా కల్పిస్తున్నట్లు వెల్లడించింది టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర. ఇదిలా ఉండగా హనుమ జయంతి వేడుకల సందర్భంగా భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.
