H-1B Visa : అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సర్కారు హెచ్-1బీ వీసా (H-1B Visa) ఫీజును ఒక్కసారిగా లక్ష డాలర్లకు పెంచిన నిర్ణయం ఐటీ రంగంలో కలకలం రేపింది. అయితే, ఈ పెంపు భారత ఐటీ సర్వీస్ కంపెనీలపై పెద్దగా ప్రభావం చూపదని దేశీయ పరపతి రేటింగ్ సంస్థ క్రిసిల్ అంచనా వేసింది.
H-1B Visa Updates
క్రిసిల్ నివేదిక ప్రకారం, వీసా ఫీజుల పెరుగుదల వల్ల కలిగే 30 నుంచి 70 శాతం భారాన్ని భారత కంపెనీలు తమ అమెరికా క్లయింట్లకే బదిలీ చేసే అవకాశం ఎక్కువగా ఉంది. ఈ నేపథ్యంలో కంపెనీల నిర్వహణ లాభాలు కొంత మేర తగ్గినా, ప్రభావం పరిమితంగానే ఉంటుందని సంస్థ పేర్కొంది. వచ్చే ఆర్థిక సంవత్సరం లాభాలు గత ఏడాదితో పోలిస్తే గరిష్టంగా 10-20 బేసిస్ పాయింట్లు (100 బేసిస్ పాయింట్లు = 1 శాతం) తగ్గే అవకాశం ఉందని స్పష్టంచేసింది.
గత ఆర్థిక సంవత్సరంలో భారత ఐటీ కంపెనీల మొత్తం విదేశీ ఆదాయంలో అమెరికా వాటా 53 శాతం ఉంది. వీసా ఫీజు పెరిగినా ఈ ఆదాయానికి పెద్ద నష్టం వాటిల్లే అవకాశం లేదని క్రిసిల్ అభిప్రాయపడింది. ప్రస్తుతం అమెరికాలోని భారత ఐటీ ఉద్యోగుల జీతభత్యాల్లో వీసా ఫీజు భారము కేవలం 0.02-0.05 శాతం మాత్రమే.
నివేదికలోని ముఖ్యాంశాల ప్రకారం, హెచ్-1బీ వీసాల (H-1B Visa) ఆధారంగా పనిచేసే ఉద్యోగులు ప్రస్తుతం 35 శాతం వద్ద ఉన్నారు. ఈ స్థాయిలో కొనసాగితే వచ్చే ఏడాది జీతాల ఖర్చులో వీసా ఫీజు భారం గరిష్ఠంగా 1 శాతం దాటవచ్చని అంచనా. అయితే, హెచ్-1బీ ఉద్యోగుల శాతం 35 కంటే తగ్గితే, ఈ భారం 0.3 నుంచి 0.6 శాతం వరకు మాత్రమే ఉంటుందని పేర్కొంది.
2017 నుంచి 2025 మధ్యకాలంలో హెచ్-1బీ ఉద్యోగులను భారత ఐటీ కంపెనీలు సగటున ప్రతి ఏడాది 9 శాతం చొప్పున తగ్గించుకుంటున్నాయి. వీసాల తిరస్కరణ రేటు పెరగడం, అమెరికాలోని స్థానికుల నియామకంపై దృష్టి పెట్టడం, అలాగే నియర్‌షోర్ కేంద్రాల విస్తరణ ఈ వ్యూహంలో భాగమని నివేదిక తెలిపింది.
అంతిమంగా, హెచ్-1బీ ఫీజుల పెంపు వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచే ప్రభావం చూపినప్పటికీ, భారత ఐటీ కంపెనీల లాభదాయకతపై పెద్దగా ముప్పు లేదని క్రిసిల్ తేల్చింది.
Also Read : Today Gold Price : నేడు కూడా స్వల్ప తగ్గుదలతో నడుస్తున్న పసిడి ధరలు



















