ఒంటిమిట్ట / తిరుపతి : ఒంటిమిట్ట శ్రీ కోదండ రామస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో చివరిరోజైన శనివారం ఆలయ సమీపంలోని పుష్కరిణిలో చక్రస్నానం నేత్రపర్వంగా జరిగింది. విశేష సంఖ్యలో భక్తులు పాల్గొని పుణ్యస్నానాలు ఆచరించారు.ఆలయంలో ఉదయం 4 గంటలకు సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి ఆలయ శుద్ధి, ఆరాధన నిర్వహించారు. ఉదయం 9.30 గంటలకు శ్రీ లక్ష్మణ సమేత సీతారాములవారు తిరుచ్చిలో, సుదర్శన చక్రత్తాళ్వార్ పల్లకిలో ఊరేగింపుగా పుష్కరిణి వద్దకు వేంచేశారు.
ఉదయం 10.30 నుండి 11.15 గంటల వరకు స్వామి, అమ్మవార్ల ఉత్సవ మూర్తులకు వేడుకగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఇందులో సీతారామ లక్ష్మణ సరసన చక్రత్తాళ్వార్లు పాలు, పెరుగు, తేనె, పసుపు, చందనంతో అభిషేకాలు అందుకున్నారు. అనంతరం అర్చకులు వేదమంత్రోచ్ఛారణ నడుమ శాస్త్రోక్తంగా చక్రస్నానం నిర్వహించారు. రాత్రి 7 గంటలకు ధ్వజావ రోహణంతో శ్రీ కోదండ రామస్వామి వారి బ్రహ్మోత్సవాలు ముగిశాయి. ఈ కార్యక్రమంలో డెప్యూటీ ఈవో ప్రశాంతి, టెంపుల్ ఇన్స్పెక్టర్ నవీన్, ఆలయ అర్చకులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
ఇదిలా ఉండగా శ్రీ కోదండ రామస్వామి వారి ఆలయంలో ఏప్రిల్ 5వ తేదీ ఆదివారం సాయంత్రం 6 నుండి రాత్రి 9 గంటల వరకు పుష్పయాగ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని జేఈవో వి. వీరబ్రహ్మం వెల్లడించారు.



















