తిరుమల : యోగ అనేది కేవలం ఆరోగ్య సాధన మాత్రమే కాకుండా ఆధ్యాత్మిక వికాసానికి మార్గదర్శకమని టీటీడీ జేఈవో డా. ఎ. శరత్ అన్నారు. టీటీడీ ఈవో ఆదేశాల మేరకు జూన్ 20 వరకు యోగా ప్రామాణిక విధానాల ప్రకారం కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రతి ఉద్యోగి ప్రతిరోజూ ఉదయం జరిగే యోగాభ్యాసంలో పాల్గొనాలని కోరారు. యోగ దినోత్సవాన్ని పురస్కరించుకుని జూన్ 18, 19, 20 తేదీలలో ఉద్యోగులకు యోగ పోటీలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. జూన్ 21న టీటీడీ పరిపాలనా భవనంలోని పరేడ్ గ్రౌండ్‌లో అంతర్జాతీయ యోగ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు.
అంతకు ముందు టీటీడీ పరిపాలనా భవనం, ఎస్వీ ఆయుర్వేద కళాశాల, స్విమ్స్, బర్డ్, శ్వేత భవనం, ఎస్వీ సంగీత కళాశాల, శ్రీ గోవిందరా జస్వామి ఆలయం తదితర కేంద్రాలలో ఉద్యోగులు, విద్యార్థులు, సిబ్బంది గంటపాటు యోగాసనాలు నిర్వహించారు. అనంతరం భారీ ర్యాలీగా మహతి కళాక్షేత్రానికి చేరుకుని కార్యక్రమంలో పాల్గొన్నారు. మహతి కళాక్షేత్రంలో ఎస్వీబీసీ రూపొందించిన యోగాపై ప్రత్యేక ఆడియో–విజువల్ ప్రదర్శన ఆకట్టుకుంది. అనంతరం యోగా మాస్టర్ కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో సూర్య నమస్కారాలు, వివిధ యోగాసనాల ప్రదర్శన నిర్వహించారు. ప్రత్యేక పూజలు, జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమం ఆధ్యాత్మిక వాతావరణంలో కొనసాగింది. టిటిడి ఆలయాల్లోని వివిధ ప్రాంతాల్లో టిటిడి ఆరోగ్యానంద ప్రారంభ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఎస్వీడబ్ల్యూ కళాశాల తెలుగు విభాగాధిపతి డా. కృష్ణవేణి వ్యాఖ్యాతగా వ్యవహరించగా, టీటీడీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు.
