తిరుపతి : ఒంటిమిట్టలోని శ్రీ కోదండ రామస్వామి ఆలయంలో మార్చి 27 నుంచి వార్షిక బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఏప్రిల్ 1న శ్రీ సీతారాముల కళ్యాణోత్సవం జరగనుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీఎం చంద్రబాబు నాయుడు హాజరవుతారు. ప్రభుత్వం తరపున స్వామి, అమ్మవార్లకు పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. ఈ సందర్భంగా విచ్చేసే భక్తులకు సౌకర్యవంతమైన సేవలు కల్పించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో ముందస్తు ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ డా. చెరుకూరి శ్రీధర్ అధికారులను ఆదేశించారు.
శ్రీ సీతారాముల కళ్యాణోత్సవం ఏర్పాట్లపై ఒంటిమిట్ట టీటీడీ అతిథి గృహంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, ముఖ్యంగా శ్రీరామ నవమి , శ్రీ సీతారాముల కళ్యాణోత్సవాలకు భారీ సంఖ్యలో భక్తులు విచ్చేసే అవకాశం ఉన్నందున భద్రత, పార్కింగ్, అన్నప్రసాదాల పంపిణీ, తాత్కాలిక మరుగుదొడ్లు, నిరంతరాయ విద్యుత్ సరఫరా, ప్రథమ చికిత్స కేంద్రాలు, ఆర్టీసీ బస్సులు, హెల్ప్ డెస్కులు, సూచిక బోర్డులు, పారిశుద్ధ్యం, పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ వంటి అన్ని విభాగాలు సమగ్ర కార్యాచరణ ప్రణాళికతో పని చేయాలని స్పష్టం చేశారు.


















