తిరుపతి : తిరుపతిలోని శ్రీ గోవిందరాజ స్వామి ఆలయం బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఈనెలాఖరు వరకు కొనసాగుతాయి. శ్రీ గోవింద రాజ స్వామి వారు సర్వభూపాల వాహనంపై విహరించి భక్తులను అనుగ్రహించారు. రాత్రి 7 గంటలకు ప్రారంభమైన వాహనసేవ భక్తి పారవశ్యంతో వైభవంగా సాగింది. గోవింద నామ స్మరణలతో మారుమోగిన మాడవీధుల్లో భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించి స్వామి వారి దివ్య మంగళ రూపాన్ని దర్శించుకున్నారు.
“సర్వభూపాల” అంటే సమస్త రాజులు, దిక్పాలకులు అని అర్థం. సర్వలోకాల అధిపతిగా శ్రీహరి అందరి హృదయాల్లో కొలువై ఉంటాడని ఈ వాహనసేవ సూచిస్తుంది. స్వామి వారిని తమ భుజ స్కంధాలపై మోసే దిక్పాలకులు భగవత్సేవలో నిమగ్నమై ప్రజలను ధర్మబద్ధంగా పాలిస్తారని ఈ వాహనసేవ ద్వారా ఆధ్యాత్మిక సందేశం అందుతుంది. టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్, అన్నమాచార్య ప్రాజెక్ట్, దాససాహిత్య ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన భక్తి సంగీత, హరికథ, ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. మంగళ వాయిద్యాలు, భజనలు, కోలాటాలతో తిరుపతి మాడవీధులు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి.
బుధవారం ఉదయం 5 గంటల నుండి 9 గంటల వరకు పల్లకీ ఉత్సవం (మోహినీ అవతారోత్సవం) వైభవంగా నిర్వహించారు. అనంతరం రాత్రి గరుడ వాహనంపై శ్రీ గోవింద రాజ స్వామివారు విహరించి భక్తులకు దివ్య దర్శనం ఇస్తారు.
