హైదరాబాద్ : శ్రీరామ నవమి పండుగ సందర్బంగా హైదరాబాద్ నగరంలో భారీ ఎత్తున శోభా యాత్రను చేపట్టారు. ఈ సందర్బంగా ముఖ్య అతిథిగా హాజరయ్యారు రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా . ఇదిలా ఉండగా శోభా యాత్రను పురస్కరించుకుని హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ శుక్రవారం సీతారాం బాగ్ పరిసరాల్లో చేపట్టిన భద్రతా ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా సీపీ మీడియాతో మాట్లాడుతూ, నగరంలో జరగనున్న శ్రీరాముడి శోభాయాత్ర ప్రశాంతంగా సాగేందుకు పోలీస్ శాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిందని వెల్లడించారు.
ఈ యాత్ర ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు సీతారాం బాగ్ ఆలయం నుంచి ప్రారంభమై, రాత్రి 10 గంటల కల్లా ముగిసేలా పక్కా రూట్ మ్యాన్ సిద్ధం చేశామని తెలిపారు. ఇప్పటికే పలు శాఖల అధికారులతో కలిసి యాత్ర సాగే మార్గాలను క్షుణ్ణంగా పరిశీలించామని చెప్పారు. ఎక్కడా ఎటువంటి ఆటంకాలు కలగకుండా డ్రోన్లు, సీసీ టీవీ కెమెరాల ద్వారా నిరంతరం నిశితంగా పర్యవేక్షిస్తామని పేర్కొన్నారు. ఈ భారీ శోభాయాత్ర కోసం దాదాపు 3 వేల మంది సిబ్బందితో పటిష్టమైన బందోబస్తును ఏర్పాటు చేసినట్లు వివరించారు . అంతకు ముందు గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా , జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ కలిసి ఆయన శ్రీ సీతారామచంద్ర స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.


















