హైదరాబాద్ : లే ఔట్ వేసినప్పుడు పార్కులుగా చూపించారని, ఆ తర్వాత అవి ప్లాట్లుగా మార్చేసి లే ఔట్ వేసిన వారితో పాటు.. కాలనీ సంక్షేమ సంఘాల వారు అమ్ముకుంటున్నారని పలువురు హైడ్రా ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. గ్రామ పంచాయతీ లే ఔట్ నుంచి హుడా లే ఔట్ వరకూ ఇదే పరిస్థితి నెలకొందని వాపోయారు. పార్కులుగా పేర్కొంటూ ఆయా గ్రామపంచాయతీలకు, మున్సిపాలిటీలకు, కార్పొరేషన్లకు గిఫ్ట్ డీడ్‌లు రాసిచ్చిన తర్వాత కూడా పార్కు స్థలాలు ప్లాట్లుగా మారినట్టు ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రజావసరాలకు ఉద్దేశించిన స్థలాలు, రహదారులను కూడా వదలకుండా కబ్జాలు చేస్తున్నారంటూ పలువురు ఫిర్యాదు చేశారు.
గతంలో 7 కాలనీలకు దారి చూపుతూ ఆక్రమణలతో పాటు ప్రహరీలను హైడ్రా తొలగించినా ప్రయోజనం లేక పోయిందని తుర్కయాంజల్ మున్సిపాలిటీ 24వ వార్డు నివాసితులు ఫిర్యాదు చేశారు. అక్కడ రోడ్డు వేయడానికి ఆక్రమణదారులు అడ్డు చెబుతున్నారని, స్థానిక అధికారులు చొరవ చూపడం లేదని వెంటనే రోడ్డు వేయాలని కోరారు. కమిషనర్ ఏవీ రంగనాథ్ ఆధ్వర్యంలో నిర్వహించిన హైడ్రా ప్రజావాణికి మొత్తం 65 ఫిర్యాదులు వచ్చాయి. వీటిని ఆయనే స్వయంగా పరిశీలించారు. ఫిర్యాదుదారుల ముందే కమిషనర్ సంబంధిత అధికారులకు ఫోన్ చేశారు. వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
















