అమరావతి : ఉద్యోగుల సంక్షేమం కోసం తమ సర్కార్ కట్టుబడి ఉందని స్పష్టం చేశారు మంత్రి అచ్చెన్నాయుడు. దీంతో తమ సమస్యల పరిష్కారం కోసం ఆందోళన చేపట్టిన ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (PACS) ఉద్యోగులు ఆందోళన విరమించారు. ఈ సందర్బంగా మంత్రి అచ్చెన్నాయుడు అధ్యక్షతన వ్యవసాయ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ బుడితి రాజశేఖర్ (ఎక్స్‌ఆఫీషియో), ఆర్ సీ ఎస్ ఆహ్మద్ బాబు, ఆప్కాబ్ ఎండీ రామకృష్ణలతో కలిసి ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు చేశారు. \ఉద్యోగుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సమావేశాల ఫలితంగా 6 డిసెంబర్ 2025 నుంచి కొనసాగుతున్న పీఏసీఎస్ ఉద్యోగుల ఆందోళనకు తెరపడింది. ప్రభుత్వం ఉద్యోగుల జీతాలకు మొత్తం 20 శాతం పెంపును ఆమోదించగా, గ్రాట్యుటీని రూ.2 లక్షల నుంచి రూ.4 లక్షలకు పెంచింది.
అలాగే ప్రతి ఉద్యోగికి రూ.5 లక్షల కవరేజీతో సమగ్ర గ్రూప్ మెడికల్ హెల్త్ ఇన్సూరెన్స్ పథకం అమలు చేయాలని నిర్ణయించింది. పీఏసీఎస్ ఉద్యోగులకు సంబంధించిన పై ప్రయోజనాల అమలు విధానాలను ఉన్నత స్థాయి కమిటీ అతి త్వరలో ప్రకటిస్తుందని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. అదేవిధంగా పీఏసీఎస్ యూనియన్లకు సంబంధించిన ఇతర డిమాండ్లను కూడా కమిటీ పరిశీలించి ప్రభుత్వానికి సిఫారసులు చేయనుందన్నారు. సహకార బ్యాంకింగ్ రంగాన్ని బలోపేతం చేయడంలో, రాష్ట్ర వ్యవసాయ అభివృద్ధికి మద్దతు ఇవ్వడంలో పీఏసీఎస్ ఉద్యోగుల పాత్ర కీలకమని ప్రభుత్వం స్పష్టంగా గుర్తించిందన్నారు. పీఏసీఎస్ కంప్యూటరైజేషన్, ఈఆర్పి లో రియల్‌టైమ్ లావాదేవీలు, డైనమిక్ ఈఓడీ ప్రక్రియలు, హెచ్ఆర్ఎంఎస్ ద్వారా జీతాల చెల్లింపు వంటి కీలక బాధ్యతలను ఉద్యోగులు నిబద్ధతతో నిర్వహిస్తున్నారని మంత్రి అచ్చెన్న ప్రశంసించారు.













