విజయవాడ : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన చేశారు. పర్యాటక, సాంస్కృతిక రంగాల ప్రోత్సాహానికి విజయవాడ ఉత్సవ్ 2.0 వేదికగా నిలుస్తోందన్నారు. ఇలాంటి కార్యక్రమాలు ప్రజలకు ఆనందాన్ని, ఉల్లాసాన్ని అందించడమే కాకుండా, రాష్ట్ర సాంస్కృతిక వారసత్వాన్ని పరిరక్షించేందుకు దోహద పడతాయని పేర్కొన్నారు. రాష్ట్రంలోని కళలు, సంస్కృతులను ప్రదర్శించేందుకు, పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు, అలాగే స్థానిక కళాకారులు , హస్త కళాకారులకు అవకాశాలు కల్పించే లక్ష్యంతో ‘విజయవాడ ఉత్సవ్ 2.0’ను నిర్వహించినట్లు తెలిపారు. ఈ ఉత్సవంలో భాగంగా ఏర్పాటు చేసిన భారీ కార్నివాల్‌ను ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇటువంటి కార్యక్రమాలు ప్రజలకు సంతోషాన్ని, ఉత్సాహాన్ని ఇవ్వడమే కాకుండా, మన సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడటంలో సహాయ పడతాయని పేర్కొన్నారు.
సాంకేతికత వల్ల ఒత్తిడి పెరుగుతోందని, దీనిని అధిగమించడానికి ఆధ్యాత్మికతను అలవర్చుకోవాలని సూచించారు సీఎం. ఆధ్యాత్మికత మనస్సును అదుపులో ఉంచుకోవడానికి తోడ్పడుతుందని పేర్కొన్నారు. మానసిక ప్రశాంతతను పెంపొందించేందుకు విజయవాడ ఉత్సవ్ వంటి కార్యక్రమాలు నిర్వహించాలని అన్నారు చంద్రబాబు నాయుడు అన్నారు. విజయవాడ ఉత్సవ్‌తో పాటు జాతీయ స్థాయి ‘సరస్ మేళా’ను కూడా నిర్వహించడం వల్ల నగరానికి ఒక ప్రత్యేకమైన కళాత్మక గుర్తింపు లభించిందని ఆయన చెప్పారు. రాష్ట్రంలోని కళలు, సంప్రదాయాలు , తెలుగు సాంస్కృతిక వారసత్వాన్ని ప్రపంచానికి చాటిచెప్పాలని ఆయన సూచించారు. ఈ ఏడాది దసరా పండుగ సందర్భంగా కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య, గత ఏడాదితో పోలిస్తే రెండు లక్షలు అధికమని ఆయన తెలిపారు. ‘విజయవాడ ఉత్సవ్ 2.0’ కార్యక్రమానికి తమిళనాడు, మధ్యప్రదేశ్ రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరయ్యారని తెలిపారు. గత వైఎస్‌ఆర్‌సీపీ పాలనలో పండుగలు జరగలేదని, 2024కు ముందు రాష్ట్రంలో అశాంతి నెలకొందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.
