ఖమ్మం జిల్లా : తెలంగాణ ప్రభుత్వం ఖమ్మంలోని వెలుగుమట్ల భూ నిర్వాసితులకు తీపి కబురు చెప్పింది. నిర్వాసితులకు మార్చి 15లోపు న్యాయం చేస్తామని ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నాం అన్నారు ఈ సందర్బంగా రాష్ట్ర రెవిన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. అనుకున్న దాని కంటే నాలుగు రోజుల ముందే అంటే 10 రోజుల్లోనే అర్హులైన పేదలకు గుర్తించిన స్థలంతో పాటు ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలను లబ్ధిదారులకు అందజేయడం నాకెంతో గర్వంగా, సంతోషంగా ఉందన్నారు.
ఖమ్మం కలెక్టరేట్ కార్యాలయంలో వెలుగుమట్ల భూ నిర్వాసితులకు ఇందిరమ్మ ఇండ్లు, ఇండ్ల స్థలాల పట్టాల అందించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు మంత్రులు పాల్గొన్నారు.
వీరతో పాటు ఎమ్మెల్సీ మల్లన్న, ఎమ్మెల్యే రాందాస్ నాయక్ , జిల్లా కలెక్టరు, ఉన్నాతాధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు హాజరయ్యారు.
మార్చి1న వెలుగుమట్ల భూ నిర్వాసితులను ప్రత్యక్షంగా కలిసి వాస్తవాలు తెలుసు కోవడం జరిగిందన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. భూధాన్ భూముల్లో నివాసం ఉంటున్న ప్రజలు కనీస అవసరాలు లేక అనేక ఇబ్బందులను పడ్డారని అన్నారు. అక్కడ కొందరు వ్యక్తులు ఒక ముఠాలా తయారై పట్టాలు ఇప్పిస్తామని పేదలను నమ్మించి మోసం చేశారని ఆరోపించారు. బ్రోకర్ల మాటలు నమ్మిన ప్రజలు వారికి అధిక మొత్తంలో డబ్బులను ముట్టజెప్పారని అన్నారు.


















