అమరావతి : తమ సామాజిక వర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే జోగి రమేష్ గురించి కూటమి సర్కార్ కు చెందిన నేతలు ఎవరైనా నోరు జారినా, లేదా అనుచిత వ్యాఖ్యలు చేసినా ఊరుకునేది లేదని హెచ్చరించారు గౌడ గీత కార్మికులు. నోరు అదుపులో పెట్టుకోకపోతే అదే కల్లు ఇచ్చే మా తాటిచెట్టుకు వేలాడతీస్తామని వార్నింగ్ ఇచ్చారు. మైలవరం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాదు ఫొటోలు తగలబెట్టి నిరసన తెలిపారు గౌడ సంఘం నాయకులు, గీత కార్మికులు. ఇక నుంచి కులం జోలికి కానీ, కులవృత్తిని చులకన చేసి మాట్లాడితే తాట తీస్తామని మండిపడ్డారు.
జోగి రమేష్ గౌడ కులస్థుడు అని, కల్లు అమ్మడం అనేది వృత్తి అని, అది కుల జీవనమని పేర్కొన్నారు.
తనను కావాలని లక్ష్యంగా చేసుకుని అవాకులు, చెవాకులు మాట్లాడితే తగిన బుద్ధి చెపుతామని, గౌడ బిడ్డల సత్తా ఏమిటో చూపిస్తామని అన్నారు. అగ్రకుల అహంకారంతో నోటికి వచ్చినట్లు మాట్లాడితే అడ్రస్ లేకుండా చేస్తామని స్పష్టం చేశారు గౌడ , గీత కార్మికులు, నేతలు. ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ నోటి దూలను అదుపులో ఉంచుకోవాలని లేక పోతే ఉరికించి కొడతామని , అందుకు సిద్దంగా ఉండాలని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. తమ సామాజిక వర్గానికి చెందిన నాయకుడు జోగి రమేష్ గురించి తూల నాడిన వసంత కృష్ణ ప్రసాద్ బహిరంగంగా క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేశారు.
