తిరుమల : టీటీడీ గోశాలలను జంతు సంక్షేమం, పరిశుభ్రత, భద్రత, సౌకర్యాల పరంగా అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా అభివృద్ధి చేయాలని టీటీడీ అదనపు ఈవో సి.హెచ్. వెంకయ్య చౌదరి సూచించారు. తిరుమలలోని శ్రీ పద్మావతి అతిథి గృహంలో గల సుధర్మ సమావేశ మందిరంలో టీటీడీ గోశాలలను ఉచితంగా అభివృద్ధి చేసేందుకు స్వచ్ఛందంగా విచ్చేసిన రిలయన్స్ ఇండస్ట్రీస్ కు చెందిన వంతారా సంస్థ ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. గోశాలలు, జంతు సంరక్షణ కేంద్రాల అభివృద్ధి, మౌలిక వసతుల మెరుగుదలపై చర్చించారు.
ప్రస్తుతం ఉన్న సౌకర్యాలను ఆధునీకరించడంతో పాటు జంతువులకు మరింత సురక్షితమైన, పరిశుభ్రమైన, సౌకర్యవంతమైన వాతావరణం కల్పించేలా చర్యలు చేపట్టాలని అదనపు ఈవో పేర్కొన్నారు. గోశాలల అభివృద్ధిలో భాగంగా గోడలకు టైల్స్ ఏర్పాటు, స్టీల్ నిర్మాణాలకు పెయింటింగ్, పక్షులు, ఇతర జంతువులు ప్రవేశించకుండా జీఐ మెష్ ఏర్పాటు, కొత్త స్టెయిన్‌లెస్ స్టీల్ గేట్ల ఏర్పాటు, గోడల మరమ్మతులు, పెయింటింగ్ తదితర పనులకు సమగ్ర ప్రణాళిక రూపొందించినట్లు వంతార సంస్థ ప్రతినిధులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అదనపు ఈవోకు వివరించారు.
పశువుల కదలికలకు అనుగుణంగా స్తంభాల మధ్య దూరం, తగినంత గాలి ప్రసరణ ఉండేలా వీటిని నిర్మించడంతో పాటు, మేత, నీటి వసతులు, సరైన డ్రైనేజీ వ్యవస్థ, గోశాలల పరిసరాల్లో మొక్కలు నాటి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పించేందుకు అవసరమైన చర్యలు చేపడతామని తెలిపారు. స్వామి వారి కైంకర్యాలకు అవసరమైన పాల ఉత్పత్తులలను సాధ్యమైనంత వరకు తిరుమలలోనే ఉత్పత్తి చేసేలా సమగ్ర ప్రణాళిక రూపొందించాలని అదనపు ఈవో ఆదేశించారు. స్వామివారి కైంకర్యాలకు అవసరమైన పాల ఉత్పత్తులను తిరుమలలోనే సమకూర్చు కోవడంతో పాటు, గో సంరక్షణకు మరింత ప్రాధాన్యతనిస్తూ గోశాలలను సమగ్రంగా అభివృద్ధి చేయాలని ఆయన పేర్కొన్నారు.



















