నూకాంబిక అమ్మవారి కొత్త అమావాస్య జాతర

భక్తుల సౌకర్యార్థం పటిష్ట బందోబస్తు

hellotellugu-AmbikaAmmaVaru

అనకాపల్లి : రాష్ట్ర పండుగగా గుర్తింపు పొందిన అనకాపల్లి నూకాంబిక అమ్మవారి ‘కొత్త అమావాస్య’ జాతర నెల రోజుల పాటు జరగనున్న నేపథ్యంలో, భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అత్యంత పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా . తెలిపారు. మంగళవారం ఆయన ఆలయ పరిసరాలను సందర్శించి, భద్రతా ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో సమీక్షించారు. ప్రస్తుతం వేసవి కాలం కావడంతో ఎండలు ఎక్కువగా ఉన్నాయన్నారు. భక్తులు క్యూ లైన్లలో గంటల తరబడి వేచి ఉండాల్సి వచ్చినప్పుడు వడ దెబ్బకు గురికాకుండా నీడ (షెడ్లు), చల్లని మంచినీరు, ఓఆర్ఎస్ (ORS) ప్యాకెట్లు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

బందోబస్తులో ఉన్న పోలీసులు అత్యంత అప్రమత్తంగా ఉండాలన్నారు. రద్దీ ఎక్కువగా ఉన్నప్పుడు తోపులాటలు జరగకుండా చూడాలని సూచించారు. ముఖ్యంగా మహిళలు, చిన్న పిల్లలు ,వృద్ధుల పట్ల సున్నితంగా వ్యవహరిస్తూ వారికి తగిన సహకారం అందించాలని పేర్కొన్నారు ఎస్పీ. జాతర నెల రోజుల పాటు పట్టణంలో ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ప్రత్యామ్నాయ మార్గాలను మళ్లించడం జరిగిందన్నారు. పార్కింగ్ స్థలాల వద్ద సిబ్బంది నిరంతరం నిఘా ఉంచాలని పేర్కొన్నారు.

జనసందోహంలో దొంగతనాలు, చైన్ స్నాచింగ్ వంటివి జరగకుండా సాదా సీదా దుస్తుల్లో నిఘా బృందాలను ఏర్పాటు చేశామ‌న్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠిన చర్యలు తప్పవని ఎస్పీ హెచ్చరించారు. భారీ విద్యుత్ దీపాలంకరణ , స్టేజ్ ప్రోగ్రాముల వద్ద ఎటువంటి అగ్ని ప్రమాదాలు జరగకుండా ముందస్తుగా అగ్నిమాపక యంత్రాంగాన్ని సిద్ధం చేయాలని సూచించారు. ​ఈ సమీక్షలో సబ్ డివిజన్ డీఎస్పీ ఎం.శ్రావణి, ఆలయ చైర్మన్ పీలా నాగ శ్రీను, ఇన్స్పెక్టర్లు ప్రేమ్ కుమార్, వెంకట నారాయణ, ఎస్సై సంతోష్ కుమార్ , అధికారులు పాల్గొన్నారు.

Exit mobile version