అమరావతి : ఏపీలో కుంభ మేళాను తలపింప చేసేలా గోదావరి పుష్కరాలు నిర్వహిస్తామని ప్రకటించారు రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామ నారాయణ రెడ్డి. సోమవారం రాజమహేంద్రవరంలో పుష్కరాలకు సంబంధించిన అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఉభయ గోదావరి జిల్లాల్లో 212 కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న ఘాట్ల వద్ద అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తామని ఆనం తెలిపారు. టీటీడీ, శ్రీ వాణి ట్రస్ట్ నుండి లభించే రూ. 750 కోట్ల ఆర్థిక సహాయంతో, రాష్ట్ర వ్యాప్తంగా 5,000కు పైగా భజన మందిరాలను నిర్మించనున్నామని చెప్పారు. ఇదే సమయంలో గోదావరి పుష్కరాలను కుంభమేళా తరహాలో అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ఇప్పటి నుంచే ప్లాన్ చేస్తున్నామన్నారు దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి .
జూన్ 26 నుండి జూలై 7, 2027 వరకు జరగనున్న ఈ పుష్కరాలకు 10 కోట్ల మంది భక్తులు హాజరవుతారని అంచనా వేస్తున్నామన్నారు. రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి, పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్, ఎంఎల్సీ సోము వీర్రాజు, ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస రెడ్డి రూ. 9.55 కోట్ల వ్యయంతో నిర్మించనున్న ఆరు కొత్త భవనాల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. తూర్పు, పశ్చిమ గోదావరి, కోనసీమ జిల్లాల్లోని 43కి పైగా ఆలయాలను రూ. 51.79 కోట్ల వ్యయంతో అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. దేవాదాయ , పర్యాటక శాఖల సమన్వయంతో ఆలయ పర్యాటకానికి సంబంధించిన కార్యాచరణ ప్రణాళికను రూపొందిస్తున్నట్లు మంత్రి దుర్గేష్ తెలిపారు. అన్నవరం, వాడపల్లిలోని వెంకటేశ్వర స్వామి ఆలయ అభివృద్ధి పనులకు ఆనం శంకుస్థాపన చేశారు.
