గోవా : గత ఏడాది 2025లో గోవా అరుదైన రికార్డు నమోదు చేసింది. పర్యాటకుల స్వర్గధామంగా ఇప్పటికే వినుతికెక్కింది ఈ నగరం. ఏకంగా 1.08 కోట్ల మంది గోవాను సందర్శించినట్లు సమాచారం. ఇది గతంలో కంటే ఎక్కువ కావడం విశేషం. గోవాలో 1,02,84,608 మంది దేశీయ పర్యాటకులు, 5,17,802 మంది విదేశీ పర్యాటకులు వచ్చారని, మొత్తం 1,08,02,410 మంది పర్యాటకుల రాక నమోదైందని రాష్ట్ర పర్యాటక శాఖ అధికారికంగా వెల్లడించింది. నాణ్యమైన పర్యాటకాన్ని ప్రోత్సహించడం, మార్కెట్లను విస్తరించడం, పునరుత్పత్తి పర్యాటకం (రీజెనరేటివ్ టూరిజం) అనే తీరప్రాంత రాష్ట్ర లక్ష్యాన్ని ముందుకు తీసుకెళ్లడంపై గోవా ప్రభుత్వం దృష్టి సారించిందని, అందుకే పెద్ద సంఖ్యలో పర్యాటకులు గోవాను సందర్శించినట్లు తెలిపింది.
ఈ వృద్ధి స్థానిక సమాజాలకు, పర్యావరణానికి, ఆర్థిక వ్యవస్థకు దీర్ఘకాలిక ప్రయోజనాలను అందిస్తుందని పర్యాటక శాఖ మంత్రి రోహన్ ఖౌంటే తెలిపారు. చార్టర్ విమానాల ద్వారా విదేశీ పర్యాటకుల రాక గోవా అంతర్గత పర్యాటకంలో, ముఖ్యంగా సాంప్రదాయ మూల మార్కెట్ల నుండి, ముఖ్యమైన పాత్ర పోషించిందని పేర్కొంది. 2017లో, రాష్ట్రానికి 68,95,234 మంది దేశీయ పర్యాటకులు, 8,90,459 మంది విదేశీ పర్యాటకులు వచ్చారు, మొత్తం సంఖ్య 77,85,693కి చేరింది. డేటా ప్రకారం 2018, 2019లో (కోవిడ్-19కి ముందు) మితమైన వృద్ధి కొనసాగింది, మొత్తం పర్యాటకుల సంఖ్య వరుసగా 80,15,400 మరియు 80,64,400కి చేరింది.
