GDP : భారత ఆర్థిక వ్యవస్థ 2025-26 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం (ఏప్రిల్-జూన్)లో అంచనాలను మించి 7.8% వృద్ధి రేటును సాధించింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) అంచనా వేసిన 6.5% కంటే ఇది గణనీయంగా ఎక్కువ. గత ఐదు త్రైమాసికాలుగా ఇది అత్యధిక స్థాయి కావడం విశేషం. దీతో భారత్ ప్రపంచంలో వేగంగా ఎదుగుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా తన స్థానాన్ని మరింత బలపరుచుకుంది. గత ఏడాది జనవరి-మార్చి త్రైమాసికంలో నమోదైన 8.4% తర్వాత ఇది గరిష్ఠ స్థాయి.
GDP – వ్యవసాయం – సేవల రంగాల ఊపు
జాతీయ గణాంకాల కార్యాలయం (NSO) విడుదల చేసిన వివరాల ప్రకారం, వ్యవసాయ రంగం ఈ వృద్ధికి ముఖ్యమైన బలం కలిగించింది. ఈ త్రైమాసికంలో వ్యవసాయం 3.7% వృద్ధిని నమోదు చేయగా, గత సంవత్సరం ఇదే కాలంలో కేవలం 1.5% మాత్రమే ఉంది. వాణిజ్యం, హోటళ్లు, ఆర్థిక రంగం, రియల్ ఎస్టేట్ వంటి సేవల రంగం కూడా బలంగా వృద్ధి సాధించింది. తయారీ రంగం వృద్ధి 7.6% నుంచి 7.7%కి స్వల్పంగా పెరిగింది.
స్థిర ధరల ప్రకారం ఆర్థిక వ్యవస్థ విలువ రూ.44.41 లక్షల కోట్ల నుంచి రూ.47.89 లక్షల కోట్లకు పెరిగింది. ప్రస్తుత ధరల ప్రకారం విలువ రూ.79.08 లక్షల కోట్ల నుంచి రూ.86.05 లక్షల కోట్లకు చేరి 8.8% వృద్ధి సాధించింది.
ప్రభుత్వ తుది వినియోగ వ్యయం 4% నుంచి 9.7%కి పెరిగింది. అయితే ప్రైవేట్ వినియోగ వ్యయం 8.3% నుంచి 7%కి తగ్గింది. స్థూల స్థిర పెట్టుబడులు 6.7% నుంచి 7.8%కి పెరిగాయి.
GDP – రూపాయి పతనం – చరిత్రలోనే కనిష్ఠం
బలమైన ఆర్థిక వృద్ధి ఉన్నప్పటికీ, రూపాయి పతనం మార్కెట్లను ఆందోళనకు గురి చేస్తోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాల ప్రభావంతో శుక్రవారం రూపాయి తొలిసారిగా డాలర్‌తో పోలిస్తే 88 మార్క్ కంటే దిగజారింది. ఉదయం 87.73 వద్ద ప్రారంభమైన రూపాయి, ఒక దశలో 88.33కి పడిపోయి చివరికి 88.09 వద్ద ముగిసింది. ఇది ఇప్పటివరకు నమోదైన చరిత్రలోనే కనిష్ఠ స్థాయి.
విదేశీ నిధుల ఉపసంహరణ
ట్రంప్ విధించిన భారీ సుంకాల కారణంగా విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (FPIs) భారత్ నుంచి నిధులను వేగంగా ఉపసంహరించుకుంటున్నారు. శుక్రవారం ఒక్క రోజులోనే వారు ₹8,312 కోట్లకు పైగా నిధులను వెనక్కి తీసుకున్నారు. దీని ప్రభావంతో రూపాయి మరింత ఒత్తిడికి గురైంది.
ఫారెక్స్ నిల్వలు తగ్గుదల
రిజర్వ్ బ్యాంక్ గణాంకాల ప్రకారం, ఆగస్టు 22తో ముగిసిన వారంలో దేశ ఫారెక్స్ నిల్వలు $438.6 కోట్ల మేర తగ్గి $69,072 కోట్ల డాలర్లకు చేరాయి.
నిపుణుల విశ్లేషణ
అమెరికా సుంకాలు భారత ఎగుమతులపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉన్నప్పటికీ, దేశీయ డిమాండ్ బలంగా ఉండటంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు 6.3% నుండి 6.8% మధ్య కొనసాగవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. పండుగల సీజన్ డిమాండ్, జీఎస్టీ రేట్ల సరళీకరణ, వ్యవసాయ ఉత్పత్తి పెరుగుదల వంటి అంశాలు ఆర్థిక వ్యవస్థకు మద్దతు ఇస్తాయని భావిస్తున్నారు.
Also Read : Today Gold Price : రోజురోజుకు పెరుగుతూ పోతున్న పసిడి ధరలు



















