అమరావతి : ఆంధ్రప్రదేశ్ 16వ శాసనసభ ఆరవ సమావేశాలు ప్రారంభమైన సందర్భంగా అసెంబ్లీలో రాష్ట్ర ప్రగతికి ఎదురయ్యే విఘ్నాలను శాశ్వతంగా తొలగించే చారిత్రాత్మక యజ్ఞం జరగబోతోందని సభాపతి చింతకాయల అయ్యన్నపాత్రుడు స్పష్టం చేశారు. సభలో సభాపతి స్థానంలో ఉన్నవారు సాధారణంగా తమ వ్యక్తిగత అభిప్రాయాలను వ్యక్తం చేయరని, కానీ ఈనాటి సమావేశం ప్రాముఖ్యత దృష్ట్యా ఒక సగటు తెలుగు వాడిగా తన ఆవేదనను, అభిప్రాయాలను పంచుకుంటున్నానని ఆయన తెలిపారు. ఐదున్నర కోట్ల మంది ఆంధ్రుల ఆకాంక్షలకు ఈ పవిత్రమైన సభ ఒక ప్రతిరూపమని ఆయన వర్ణించారు. 2014లో నడి సముద్రంలో చుక్కాని లేని నావలా కొట్టుమిట్టాడుతున్న నూతన రాష్ట్రాన్ని తీరం చేర్చే చారిత్రక బాధ్యతను దార్శనికుడైన చంద్రబాబు నాయుడుకి ప్రజలు అప్పగించారని ఆయన గుర్తు చేశారు.
భౌగోళికంగా రాష్ట్రానికి కేంద్ర బిందువైన అమరావతిని రాజధానిగా అభివృద్ధి చేయాలని చంద్రబాబు నిర్ణయించగా, రైతన్నలు తమ సారవంతమైన భూములను త్యాగం చేశారని, అప్పట్లో వాయువేగంతో, మనోవేగంతో రాజధాని నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయని వివరించారు. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలు మారినప్పటికీ పరిపాలన అనేది ఒక నిరంతర ప్రక్రియగా కొనసాగాలని, గత ప్రభుత్వాలు చేపట్టిన మంచి పనులను కొనసాగించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. అయితే 2019లో ప్రగతి రథానికి అడ్డంకులు ఎదురయ్యాయని, ఆనాటి పాలకులు తమ చేతికి కొబ్బరికాయ దొరికినట్టు ప్రవర్తించి రాష్ట్ర విధ్వంసానికి కంకణం కట్టుకున్నారని ఆయన తీవ్రంగా విమర్శించారు. వారి ప్రగతి నిరోధక పోకడల వల్ల రాష్ట్రం కనీసం 50 ఏళ్లు వెనకబడిందని, రాజధాని కోసం భూములిచ్చిన రైతులు వీధిన పడి అవమానాల పాలయ్యారని, ప్రభుత్వ హింసకు బలయ్యారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా అమరావతిని శాశ్వత రాజధానిగా శిలాక్షరాల్లో లిఖించవలసిన అవసరం వచ్చిందని ఆయన స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన కృషితో రాష్ట్ర విభజన చట్టంలో సవరణలు తీసుకు రావడానికి కేంద్ర ప్రభుత్వం అంగీకరించిందని ఆయన సభకు తెలియజేశారు. ఈ చారిత్రక తీర్మానానికి కనీసం ప్రతిపక్షానికి చెందిన 11 మంది సభ్యులైనా హాజరై తమ తప్పులకు ప్రాయశ్చిత్తం చేసుకుంటారని ఆశించానని, కానీ వారికి ఆ ధైర్యం, నిజాయితీ లేవని ఆయన అన్నారు.
