విజయవాడ : అర్హులైన ప్రతి నేతన్నకూ ఉచిత విద్యుత్ ఫలాలు అందించాల్సిందేనని, ఇందుకు విద్యుత్, చేనేత, జౌళి శాఖాధికారులు సమన్వయంతో పని చేయాలని రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్ .సవిత స్పష్టం చేశారు. చేనేతల్లో ఉచిత విద్యుత్ పథకంపై అవగాహన కల్పించడానికి గ్రామ స్థాయిల్లో చైతన్య కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. ఈ నెల 15వ తేదీలోగా లబ్దిదారుల నుంచి దరఖాస్తుల స్వీకరణకు గడువుగా పేర్కొన్నారు. విజయవాడలోని ఓ హోటల్ లో విద్యుత్, చేనేత, జౌళి శాఖాధికారుల సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి సవిత మాట్లాడుతూ, ఎన్నికల ముందు నిర్వహించిన యువగళం పాదయాత్రలో మంత్రి నారా లోకేశ్ చేనేతల కష్టాలను స్వయంగా చూశారన్నారు.
సీఎం చంద్రబాబు నాయుడికి సైతం చేనేత కష్టాలపై స్పష్టమైన అవగాహన ఉందన్నారు. అందుకే, అధికారంలోకి కూటమి వస్తే ఉచిత విద్యుత్ ఇస్తామని ఆనాడు సీఎం, మంత్రి నారా లోకేశ్ ఎన్నికల హమీ ఇచ్చారన్నారు. ఇచ్చిన మాటకు కట్టుబడుతూ, నేతన్నలకు ఉచిత విద్యుత్ పథకాన్ని రూ.150 కోట్ల వ్యయంతో ఈ నెల ఒకటో తేదీ నుంచి సీఎం చంద్రబాబు శ్రీకారం చుట్టారన్నారు. మగ్గంపై నేసే నేతన్నలకు 200 యూనిట్లు, మర మగ్గంపై నేతన్నలకు 500 యూనిట్ల ఉచిత విద్యుత్ అందజేస్తున్నామన్నారు మంత్రి ఎస్ . సవిత. మగ్గం నేతన్నలకు నెలకు రూ.720లు, మరమగ్గం నేతన్నలకు రూ.1,860లు ఆదా అవుతుందన్నారు.విద్యుత్, చేనేత, జౌళి శాఖాధికారులు సమన్వయంతో ఉచిత విద్యుత్ పథకాన్ని అమలు చేయాలని మంత్రి సవిత సూచించారు. గ్రామాల్లో చైతన్య కార్యక్రమాలు నిర్వహించి, లబ్దిదారులను గుర్తించి, వారితో దరఖాస్తు చేయించాలన్నారు.

















