శ్రీ సత్యసాయి జిల్లా : ఏపీ రాష్ట్ర బీసీ, సంక్షేమ, చేనేత జౌళి శాఖ మంత్రి ఎస్. సవిత కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలో చేనేత అన్నలకు తీపి కబురు చెప్పారు. ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి నేతన్నలకు ఉచిత విద్యుత్ అందజేయనున్నట్లు మంత్రి సవిత తెలిపారు. మగ్గంపై నేసే నేతన్నలకు 200 యూనిట్లు, మర మగ్గంపై నేసే నేతన్నలకు 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇవ్వనున్నట్లు వెల్లడించారు. దీనివల్ల ఏడాదికి మగ్గం నేతన్నలకు ఏడాదికి రూ.8,640లు, మర మగ్గం నేతన్నలకు రూ.21,600లు ఆదా అవుతుందన్నారు. త్వరలోనే నేతన్న భరోసా పథకం కింద చేనేతలకు రూ.25 వేల ఆర్థిక సాయం అందించనున్నామని ప్రకటించారు ఎస్. సవిత.
గత వైసీపీ ప్రభుత్వం కంటే అదనంగా రూ.వెయ్యి ఇవ్వనున్నామన్నారు. 50 ఏళ్లు నిండిన చేనేతలకు రూ.4 వేల పెన్షన్లు ఇస్తున్నామన్నారు. త్రిఫ్ట్ ఫండ్ నిధులు విడుదల చేశామని, చేనేత సహకార సంఘాలకు బకాయిలు కూడా చెల్లిస్తున్నామని వెల్లడించారు. గతంలో కంచి పట్టు చీరలకు డిమాండ్ ఉండేదని, ఇప్పుడు ధర్మవరం పట్టు చీరల కొనుగోలుకు ప్రజలు ఆసక్తి చూపుతున్నారని మంత్రి సవిత వెల్లడించారు. ధర్మవరం పట్టు చీరలో నాణ్యత, నైపుణ్యాన్ని గుర్తించి కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక ఓడీ ఓపీ అవార్డు అందజేసిందని గుర్తు చేశారు. ధర్మవరం పట్టు చీరలకు మరింత ప్రాచుర్యం కల్పించేలా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు.

















