బెంగళూరు : భారతీయ సినీ చరిత్రలోనే అత్యధికంగా జనాదరణ పొందిన ప్రాంతీయ చిత్రం కన్నడ చలన చిత్ర పరిశ్రమకు చెందిన కాంతారా మూవీ. ఆ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి నేటితో నాలుగు ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్బంగా చిత్రానికి సంబంధించి తన జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు రిషబ్ శెట్టి. ఆ కన్నడ చిత్రాన్ని తెరకెక్కించేందుకు తాను సాగించిన ప్రయాణాన్ని రిషబ్ శెట్టి గుర్తు చేసుకున్నారు. ఈ చిత్రం కేవలం ఒక సినిమా మాత్రమే కాదని, తాను అందులో జీవించానని పేర్కొన్నాడు. నటీనటులు, సాంకేతిక బృందం , ప్రేక్షకులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా తాను తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. తన జీవితంలో మరిచి పోలేని మూవీ ఇదని పేర్కొన్నారు. కాంతారా ఒక చిత్రం కానే కాదని అది ఈ ప్రాంతపు అస్తిత్వానికి ప్రతీక అని పేర్కొన్నారు రిషబ్ శెట్టి.
‘కాంతార’ తనకు కేవలం ఒక సినిమా మాత్రమే కాదని, అది తాను జీవించిన ఒక ప్రపంచమని పేర్కొన్నారు . నటుడు, దర్శకుడైన రిషబ్ తన అధికారిక సోషల్ మీడియా ఎక్స్ ఖాతాలో స్పందించాడు. కీలక పోస్టు చేశాడు. కాంతార ఒక అద్భుత గాథ . వెండితెరపై ‘కాంతార’ వచ్చి నాలుగేళ్లు పూర్తయ్యాయి. ఆ తర్వాత జరిగినదంతా చరిత్రే. అన్ని వైపుల నుండి అవార్డులు, ప్రశంసలు వెల్లువెత్తాయి, కానీ మీరందరూ ఈ చిత్రంపై చూపించిన ప్రేమ సాటిలేనిది. ఇది నేను కేవలం రూపొందించిన సినిమా మాత్రమే కాదు; ఇది నేను జీవించిన ప్రపంచం, నాలో నేను మోసిన కథ . నన్ను తీర్చిదిద్దిన ఒక విశ్వాసం.
2022లో వచ్చిన ఈ యాక్షన్ థ్రిల్లర్ చిత్రంలో భాగమైన ప్రతి ఒక్కరికీ రిషబ్ తన కృతజ్ఞతలు తెలిపారు.
హృదయంలోని కథను తెరపైకి తీసుకు రావడానికి నాతో కలిసి అడుగులు వేస్తూ రేయింబవళ్లు శ్రమించిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు. మీ కఠోర శ్రమ, విశ్వాసం , ప్రేమ ‘కాంతార’ను నాకంటే గొప్ప స్థాయికి చేర్చాయి అని ఆయన జోడించారు. నా ప్రయత్నాన్ని మెచ్చుకుని ఆదరించి, ఒక గర్వించదగ్గ కన్నడ చిత్రంగా ఇది ప్రపంచ వ్యాప్తంగా విస్తరించేలా సహకరించిన ప్రతి ప్రేక్షకుడికి నేను ఎప్పటికీ రుణపడి ఉంటానని అన్నారు రిషబ్ శెట్టి.



















