హైదరాబాద్ : ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై నిప్పులు చెరిగారు బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి తాటికొండ రాజయ్య. ఆయన మీడియాతో మాట్లాడారు. ఫారెస్ట్ అధికారులను, కలెక్టర్ ను బెదిరించి దేవునూరు ఫారెస్ట్ భూములను కొల్లగొట్టిన చరిత్ర కడియం శ్రీహరిదని మండిపడ్డారు. ఓటుకు నోటులో కేసులో రెడ్ హ్యాండెడ్ గా దొరికిన రేవంత్ రెడ్డి.. కడియం శ్రీహరి విద్యావంతుడు, నీతిమంతుడని మాట్లాడడాన్ని ఖండిస్తున్నాం అన్నారు. కడియం శ్రీహరిది అవకాశవాద రాజకీయం అన్నారు. పార్టీలను ఫిరాయించడంలో సీనియారిటీ ఉందన్నారు తాటికొండ రాజయ్య.
ఆయన చేసిన ప్రతి శాఖలో అవినీతికి పాల్పడ్డాడని సంచలన ఆరోపణలు చేశారు.కడియం శ్రీహరి అంటే ఖల్నాయక్ అంటూ ఎద్దేవా చేశాడు. కడియం అనుచరుడు గోరంత బలరాం ఆధ్వర్యంలో 10% కమిషన్లతో అవినీతికి పాల్పడుతున్నాడని ఆరోపించారు. బినామీ పేర్లతో సింగపూర్, మలేషియాలో అక్రమ ఆస్తులు సంపాదించాడని ధ్వజమెత్తారు. దమ్ముంటే విచారణకు సిద్దం కావాలన్నారు. విద్యాశాఖ మంత్రిగా ఉన్నప్పుడు ప్రమోషన్ల పేరుతో కమిషన్లు తీసుకున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇరిగేషన్ మంత్రిగా ఉన్నప్పుడు ఐడల్ ప్రాజెక్టు పేర్లతో కమిషన్లు వసూలు చేశాడని, ఆ విషయం ప్రతి ఒక్కరికీ తెలుసన్నారు.
అవినీతి తిమింగలం కడియం శ్రీహరి అని పేర్కొన్నారు. కడియం శ్రీహరి బీఆర్ఎస్ పార్టీ అని స్పీకర్ క్లీన్ చీట్ ఇవ్వడం దారుణమన్నారు. అవినీతి, అక్రమాలకు పాల్పడిన కడియం శ్రీహరిని సమర్థిస్తూ రేవంత్ రెడ్డి మాట్లాడటం దారుణమన్నారు.
















