అమరావతి : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ మంత్రి ఆర్కే రోజా. ఆమె మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో సీఎంగా కొలువు తీరాక ప్రజల బాగోగులు పట్టించు కోవడం మానేశారని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యక్తిగత ప్రచారంపై ఉన్నంత శ్రద్ద ప్రజా సమస్యలు పరిష్కరించడంలో చూపించడం లేదన్నారు. చంద్రబాబు నాలుగు సార్లు ముఖ్యమంత్రి అయ్యాడని, కనీసం కుప్పంలో అయిన మెడికల్ కాలేజీ కట్టగలిగాడా అని నిలదీశారు ఆర్కే రోజా సెల్వమణి. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో ఏకంగా రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజీలకు పర్మిషన్ తీసుకు వచ్చారని అన్నారు. అంతే కాకుండా వాటిలో 7 మెడికల్ కాలేజీలను పూర్తి చేశాడని, ఇది తమ నాయకుడి ఘనత అని పేర్కొన్నారు రోజా సెల్వమణి.
ఇక చంద్రబాబు నాయుడు అనుసరిస్తున్న విధానాలు ప్రజలకు మేలు చేకూర్చేలా ఉండటం లేదన్నారు. ఆయన ఫక్తు రియల్ ఎస్టేట్ దందా చేస్తున్నాడని సంచలన ఆరోపణలు చేశారు. కొత్తగా పీపీపీ మోడల్ అంటూ తన వారికి మెడికల్ కాలేజీలను కట్టబెట్టేందుకు కుట్రకు తెర లేపాడంటూ మండిపడ్డారు ఆర్కే రోజా సెల్వమణి. తాను పదే పదే హైదరాబాద్ ను కట్టానని, హైటెక్ సిటీ నా వల్లే డెవలప్ అయ్యిందని, తానే సెల్ ఫోన్లను కూడా కనిప పెట్టానని, ఢిల్లీలో చక్రం తిప్పానంటూ పదే పదే ప్రచారం చేసుకోవడం తప్పా ఏపీకి చేసింది ఏమీ లేదన్నారు. చంద్రబాబు నాయుడు కనీసం 10 మెడికల్ కాలేజీలను కట్టలేక పోతున్నాడంటూ ఎద్దేవా చేశారు రోజా సెల్వమణి.
















