మెగా డీఎస్సీ పేరుతో స‌ర్కార్ ద‌గా : కేటీఆర్

సీఎం రేవంత్ రెడ్డిపై భ‌గ్గుమ‌న్న మాజీ మంత్రి

hellotelugu-KTR

హైద‌రాబాద్ : మాజీ మంత్రి కేటీఆర్ నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ స‌ర్కార్ పై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఆయ‌న మీడియాతో మాట్లాడారు. మేధావుల ముసుగు వేసుకుని మాయ మాటలతో మభ్యపెట్టిన గొంతులన్నీ గత రెండేళ్ల నుంచి మూగ బోయినంత మాత్రాన మీరు చేసిన పాపం ఊరికే పోద‌ని అన్నారు.  మెగా డీఎస్సీ పేరిట దగా చేసింది చాల‌క ఉద్యోగాలు ఇచ్చామ‌ని సీఎం రేవంత్ రెడ్డి ప్ర‌జ‌ల సాక్షిగా , నిరుద్యోగుల సమక్షంలో అబద్దాలు చెప్ప‌డం విడ్డూరంగా ఉంద‌న్నారు కేటీఆర్, నిరుద్యోగ భృతి పేరిట చేసిన ద్రోహానికి గుణపాఠం చెప్పేందుకు ఆదిలాబాద్ నుంచి అశోక్ నగర్ చౌరస్తా వరకూ ప్రతి నిరుద్యోగి సిద్ధంగా ఉన్నాడ‌ని వార్నింగ్ ఇచ్చారు. ఇక‌నైనా జాగ్ర‌త్త వ‌హించాల‌ని హెచ్చ‌రించారు.

ఇప్పటికే మూడు దఫాలుగా రైతుబంధు ఎగ్గొట్టి 70 లక్షల మంది అన్నదాతల పొట్టకొట్టారని ఆరోపించారు కేటీఆర్. కేసీఆర్ పాలనలో ఆత్మగౌరవంతో బతికిన రైతన్నల‌ను మళ్లీ అప్పులపాలు చేసి తీరని ద్రోహం చేశారని ఆవేద‌న చెందారు కేటీఆర్. సీఎం సీటుపై కూర్చున్న మరుక్షణంలోనే ప్రతి మహిళకు 2500 ఇస్తానని చెప్పిన మాటకు రెండేళ్లయినా ఒక్కరికీ దిక్కులేక పోవడంతో ఆడబిడ్డలు కోపంతో రగిలి పోతున్నారని చెప్పారు. ఆరు గ్యారెంటీలన్నీ అక్షరాలా గారడీలేనని, 420 హామీలన్నీ నయవంచన మాత్రమేనని తన నిజ స్వరూపాన్ని బయటపెట్టిన రేవంత్ సర్కారుకు నిరుద్యోగుల ఉసురు తగలడం ఖాయం అన్నారు .

చైతన్యానికి ప్రతీకైన తెలంగాణ యువత సంఘటిత శక్తిలో ఉన్న బలం ఏంటో, వారు బిగించే పిడికిళ్లు కాంగ్రెస్ పునాదులను ఎలా పెకిలిస్తాయో త్వరలోనే చూస్తార‌ని హెచ్చ‌రించారు.

Exit mobile version