హైదరాబాద్ : ఉద్యోగాల కోసం వేచి చూడడం కాదు జాబ్స్ క్రియేట్ చేసి ఉపాధి కల్పించే స్థాయికి యువత కృషి చేయాలని పిలుపునిచ్చారు మాజీ మంత్రి కేటీఆర్. తనను స్పూర్తిగా తీసుకుని హైదరాబాద్ లోని బోరబండకు చెందిన తొమ్మిది మంది యువకులు డాక్టర్ గార్డ్ ప్రైవేట్ సొల్యూషన్స్ పేరుతో నూతన కంపెనీని స్థాపించారు. ఇది పూర్తిగా స్టార్టప్ ఐడియా. ఈ సందర్బంగా కేటీఆర్ ను తమ కంపెనీని సందర్శించాల్సిందిగా కోరారు. దీనికి ఆయన ఒప్పుకుని వారి అభ్యర్థనను మన్నించి సందర్శించారు. వారు చేసిన ప్రయత్నాన్ని ప్రత్యేకంగా అభినందించారు. ఇలాంటి యువత ఈ దేశంలో ఎందరో ఉన్నారని పేర్కొన్నారు. వారందరికీ సహకారం అందిస్తే ఎన్నో కొత్త ఆవిష్కరణలు వస్తాయన్నారు కేటీఆర్.
ఈ సందర్బంగా ఇమ్రోజ్ ను ప్రశంసించారు మాజీ మంత్రి. యువకుల ప్రయత్నం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఈ కంపెనీకి మొదటి కస్టమర్‌గా తానే ఉంటానని సంసిద్ధత వ్యక్తం చేశారు. తెలంగాణ భవన్‌కు సంబంధించిన వాటర్‌ప్రూఫ్ పనులను వారికి అప్పగిస్తున్నట్లు ప్రకటించారు. 24 ఏళ్ల లోపు వయసున్న ఈ మిత్ర బృందం ఎలాంటి నిరుత్సాహం లేకుండా తమ ఆలోచన పట్ల గొప్ప స్ఫూర్తితో ముందుకు వెళుతుండడం పట్ల ప్రత్యేకంగా అభినందించారు. ఎలాంటి ఆర్థిక పెట్టుబడి, కుటుంబ నేపథ్యం లేకున్నా మిత్ర బృందంతో కలిసి ఏషియన్ పెయింట్స్ పెట్టి విజయం సాధించిన స్ఫూర్తిని తాము తీసుకున్నామని యువకులు చెప్పడం అభినందనీం అన్నారు.
మంచి మనసుతో, చిత్తశుద్ధితో ఏది ప్రారంభించినా అద్భుతమైన విజయం సాధిస్తుందని, సమాజంలోని అందరి అండ, ఆశీర్వాదం లభిస్తుందన్న విశ్వాసం తనకు ఉందని కేటీఆర్ తెలిపారు. ‘డాక్టర్ గార్డ్’ భవిష్యత్తులో అద్భుతమైన విజయం సాధిస్తుందని ఆకాంక్షించారు. ఈ మిత్ర బృందం ప్రయత్నాన్ని చూసి మరింత మంది యువత ముందుకు రావాలని పిలుపునిచ్చారు.















