విజయవాడ : ఏపీ సర్కార్ నిర్వాకంపై నిప్పులు చెరిగారు మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. ముందు జోజినగర్ ఇళ్లు కూల్చివేతపై తక్షణమే సిబీఐతో విచారణ చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. ఆ ఇళ్ల కూల్చి వేత వెనుక సీఎం నారా చంద్రబాబు నాయుడు, తనయుడు నారా లోకేష్, ఎంపీ కేసినేని నాని, స్థానిక కార్పొరేటర్ సోదరుడే కారణమని సంచలన ఆరోపణలు చేశారు. మంగళవారం విజయవాడలోని భవానీపురం, జోజినగర్ సందర్శించి, అక్కడ ఇళ్ల కూల్చివేత బాధితులను పరామర్శించారు. అనంతరం మీడియాతో జగన్ రెడ్డి మాట్లాడారు. జోజినగర్ బాధితుల బ్యాంక్ రుణాలు ప్రభుత్వం చెల్లించాలని అన్నారు. ఆ 42 కుటుంబాలకు తిరిగి ఇళ్లన్నీ కట్టించి ఇవ్వాలని తేల్చి చెప్పారు. పేదలకు ఏ ప్రభుత్వమైనా అండగా నిలబడాలని, కానీ ఇక్కడ కూటమి సర్కార్ వారికి వ్యతిరేకంగా పిటిషన్లు దాఖలు చేసిందని మండిపడ్డారు.
కేంద్ర దర్యాప్తు సంస్థతో విచారణ జరిపితేనే అసలు వాస్తవాలు ఏమిటో బయట పడతాయని అన్నారు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. ఇళ్లు కట్టించక పోతే తమ ప్రభుత్వం రాగానే విచారణ జరిపించి, ఈ ఘటనకు బాధ్యులను బోనులో నిలబెట్టి తీరుతామని ప్రకటించారు. జోజినగర్ బాధితులకు పూర్తి అండగా నిలబడతామని, వారి న్యాయ పోరాటానికి పార్టీ తోడుగా ఉంటుందని అన్నారు . కోర్టు ఉత్తర్వులున్నా ఏకపక్షంగా తమ ఇళ్లు కూల్చి వేశారని, ఎంత చెప్పినా వినకుండా, పోలీసులు తమ బ్రతుకులు రోడ్డు పాల్జేశారని బాధితులు తమ గోడు వెళ్లబోసుకున్నారు. వారి అంతులేని ఆవేదన, బాధలన్నీ సావధానంగా విన్న జగన్ ఓదార్పునిచ్చారు. ప్రభుత్వ తీరును తీవ్రంగా ఆక్షేపించారు.

















