తిరుపతి : తిరుపతి పట్టణాన్ని మరింత సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దేందుకు ప్రయత్నం చేయాలని స్పష్టం చేశారు తిరుపతి కార్పొరేషన్ మేయర్ డాక్టర్ శిరీష . 2026-27 బడ్జెట్ తయారీకి సంబంధించి కీలక సమవేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఉన్నతాధికారులు హాజరయ్యారు. పలు సూచనలు చేశారు మేయర్. ప్రధానంగా బడ్జెట్ ప్రతిపాదనలో తిరుపతి నగర ప్రజల సౌకర్యాలకు , నగర విస్తరణ కోసం, మౌలిక వసతుల కల్పన కోసం నిధుల కేటాయింపు ఉండాలని అన్నారు. రాబోయే రోజుల్లో తిరుపతి గ్రేటర్ కాబోతుందని చెప్పారు. అందుకు అనుగుణంగా మన ఆలోచనలు ఉండాలని అన్నారు. మౌలిక వసతులను కల్పించ గలిగితే పట్టణం మరింత అభివృద్ది చెందుతుందని చెప్పారు మేయర్. దీని ద్వారా ప్రజలకు సౌకర్యాలు పెరగడంతో పాటు నగర పాలక సంస్థకు అదనపు ఆదాయం కూడా వస్తుందని స్పష్టం చేశారు మేయర్ శిరీష.
బడ్జెట్ ప్రతిపాదనలో ప్రజల మీద అదనపు భారం పడకుండా చూడాలని అన్నారు. అంతే కాకుండా ఇదే క్రమంలో ఆర్ధిక వనరులు పెంచుకోవడం, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రయోజిత పథకాల నుంచి ఎక్కువ నిధులు రాబట్టు కోవడంపై ఫోకస్ పెట్టాలన్నారు. అంతే కాకుండా టిటిడి సమన్వయం, సహకారంతో నిధులు మంజూరుకు ప్రత్యేక దృష్టి తో ఆలోచనలు ఉండాలని అన్నారు. అంతిమంగా మన బడ్జెట్ ను చూసి తిరుపతి నగర ప్రజలు నగరపాలక సంస్థకు చెల్లిస్తున్న ప్రతి రూపాయి సద్వినియోగం అవుతుందన్నారు. నగర పాలక సంస్థ కార్పొరేటర్లు, అధికారులు చాలా బాధ్యతతో ఉన్నారని , అని నమ్మేవిదంగా మన బడ్జెట్ ఉండాలని అధికారులకు మేయర్ డా శిరీష సూచించారు.
