ముంబై : సమాజంలో మహిళలు కీలకమైన పాత్ర పోషిస్తున్నారని పేర్కొన్నారు ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి. శనివారం ముంబాయిలో తన అధ్యక్షతన “మహిళల సాధికారతపై పార్లమెంటరీ కమిటీ” సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రైల్వే శాఖ బోర్డు, ఐఆర్సీటీసీ, కేఆర్సీఎల్, డీఎఫ్సీసీఐఎల్, ఎంఆర్వీసీ, డీఆర్ఎం ముంబై, క్యారేజ్ వర్క్ షాప్ మాతుంగ, ఐరీసెన్ అధికారులు హాజరయ్యారు. పోష్ యాక్ 2013 అమలు అంశంపై ప్రత్యేకంగా సమావేశం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇందుకు పలువురు కీలక సూచనలు, సలహాలు అందజేశారు. ఆయా కార్యాలయాలలో మహిళలపై లైంగిక వేధింపులను నిరోధించేందుకు రూపొందించిన POSH చట్టం అమలు స్థితిగతులపై సమగ్ర సమీక్ష జరిగింది .
ఉద్యోగ స్థలాలలో మహిళల భద్రత, గౌరవం, హక్కుల పరిరక్షణకు తీసుకోవాల్సిన చర్యల గురించి ప్రస్తావించారు. మహిళలకు సురక్షితమైన , అనుకూలమైన పనివాతావరణాన్ని కల్పించేందుకు అవసరమైన సూచనలు ఇవ్వడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు దగ్గుబాటి పురందేశ్వరి. కేంద్ర ప్రభుత్వం మహిళల సంక్షేమం, భద్రత కోసం చర్యలు చేపట్టిందని చెప్పారు. ఎన్నో కార్యక్రమాలు అమలు చేస్తోందన్నారు. ఇదే సమయంలో ఆయా సంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలలో పని చేస్తున్న మహిళలకు పూర్తి రక్షణ చేపట్టాల్సిన బాధ్యత వాటి పైనే ఉందన్నారు. ఎక్కడ కూడా వేధింపులకు పాల్పడినా పోష్ చట్టం అమలు చేయడం జరుగుతుందని హెచ్చరించారు దగ్గుబాటి పురందేశ్వరి. ఇందుకోసమే కేంద్ర ప్రభుత్వం మహిళా సాధికారత పై పార్లమెంటరీ కమిటీని ఏర్పాటు చేసిందని చెప్పారు. బాధితులు నిరభ్యంతరంగా తమ పట్ల ఎవరు ఇబ్బంది పెట్టినా తెలియ చేయాలని సూచించారు.
